- తెలంగాణను ప్రపంచస్థాయికి తీసుకెళ్తున్నాం
- 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం: భట్టి విక్రమార్క
- పదేండ్ల బీఆర్‌ఎస్ విధ్వంసాన్ని సరిదిద్ది ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం
- రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలి
- అమెరికాలోని ఐఓసీ మీటింగ్‌లో డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం అమెరికాలోని మేరీల్యాండ్‌లో జరిగిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐఓసీ) ప్రతినిధుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలను విదేశీ ప్రతినిధులు, ఎన్ఆర్ఐలకు వివరించారు. గత పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక విచ్ఛిన్నతకు గురైందని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన బీఆర్‌ఎస్ తీరు వల్ల గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 15 నుంచి 25వ తేదీ వరకు జీతాలు రాని పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. తమ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక క్రమశిక్షణను పాటించి, విచ్ఛిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిందని తెలిపారు.
ఇప్పుడు ప్రతి నెలా 1వ తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ చేస్తున్నామని భట్టి చెప్పారు. అంతేకాకుండా, దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు రూ.1.20 కోట్ల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నామని వెల్లడించారు.
మూసీకి పూర్వ వైభవం..
లండన్ థేమ్స్ నది తరహాలో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ద్వారా మూసీ నదిని శుద్ధి చేసి, పర్యాటక, వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని మొదలుపెట్టామని భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్ మహానగరంలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలకు చెక్ పెట్టేందుకు ‘హైడ్రా’ వ్యవస్థను తీసుకొచ్చామని, ప్రకృతి వనరులను కాపాడేందుకు కఠిన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లు, రాబోయే ఐదేండ్లలో ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ ప్లాన్‌ను అమలు చేస్తోందని తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లకు తోడుగా నాలుగో మహానగరంగా ముచ్చర్ల ప్రాంతంలో కాలుష్య రహిత నెట్-జీరో ప్రమాణాలతో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కోర్ అర్బన్, పెరి -అర్బన్ , రూరల్ అగ్రి అని మూడు ఆర్థిక మండలాలుగా వర్గీకరించి వేగంగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. అమెరికాలోని తెలుగు ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు స్వరాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా భట్టి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, విప్ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు టి.రామ్మోహన్ రెడ్డి, రాకేశ్ రెడ్డి, కాలే యాదయ్య, దొంతి మాధవరెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు హనుమాన్ల ఝాన్సీ రెడ్డి, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
