హైదరాబాద్ సిటీ, వెలుగు: 99 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సోమవారం గోషామహల్, కార్వాన్ సర్కిళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భగత్ సింగ్ జంక్షన్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఇందిరమ్మ క్యాంటీన్‌ను తనిఖీ చేశారు. పరిసర ప్రాంతాల్లోని రోడ్లపై తక్షణమే ప్యాచ్ వర్క్‌లు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
గోల్కొండ జోనల్ కమిషనర్ ముకుంద రెడ్డి, అడిషనల్ కమిషనర్ రవికిరణ్, రామ్‌కీ సంస్థ ప్రతినిధులతో కలిసి రోడ్లు, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లు(జీవీపీలు) పరిశీలించారు. అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వద్ద ఉన్న ఆక్రమణలను తొలగించి, ఆ భవనాన్ని ఉగాది రోజున ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం జియాగూడ వంద ఫీట్ల రోడ్డును కూడా పరిశీలించారు.
