న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విక్షిత్ భారత్ రోజ్‌గార్ అజీవిక మిషన్ గ్రామీణ్ (VB–G RAM G) బిల్లు, 2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఆమోద ముద్రతో వీబీ జీ రామ్ జీ బిల్లు చట్టరూపం దాల్చింది. ఈ బిల్లు విషయంలో ఓ వైపు విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తుండగా మరోవైపు రాష్ట్రపతి ఈ బిల్లుకు పచ్చజెండా ఊపడం గమనార్హం.
కాగా, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్ఈజీఏ) స్థానంలో కొత్త చట్టం తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీ జీ రామ్ జీ) బిల్లును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా 2025, డిసెంబర్ 18న ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ పథకానికి గాంధీ పేరును తొలగించడంపై ప్రతిపక్షాలు నిరసన తెలపగా, ఆందోళనల మధ్యనే ప్రభుత్వం ఈ బిల్లును సభ పాస్ చేసింది.
పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించిన ఈ బిల్లును రాష్ట్రపతి దగ్గరకు పంపింది ప్రభుత్వం. ఈ బిల్లును పరిశీలించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2025, డిసెంబర్ 21న ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ గెజిట్ విడుదల చేసింది. దీంతో వీబీ జీ రామ్ జీ బిల్లు చట్టరూపం దాల్చగా.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్ఈజీఏ) చరిత్ర పుటల్లోకెక్కింది.
