
- ఆసక్తిగా మారిన మరాఠా రాజకీయ పోరు
ముంబై : మహారాష్ట్రలోని ముంబైలో మరాఠా రాజకీయం ఆసక్తికరంగా మారింది. సిటీ పరిధిలోని ఆరు లోక్‌సభ స్థానాల్లో మూడుచోట్ల ఏక్‌నాథ్ షిండే శివసేనతో ఉద్ధవ్ థాక్రే ఆధ్వర్యంలోని శివసేన(యూబీటీ) పార్టీ హోరాహోరీగా తలపడుతున్నది. రెండు చోట్ల బీజేపీ, కాంగ్రెస్, ఒకచోట శివసేన (యూబీటీ), బీజేపీ మధ్య పోరు జరుగనున్నది. ముంబైలో మొత్తం ఆరు లోక్ సభ స్థానాలు ఉన్నాయి.
ముంబై సౌత్, ముంబై సౌత్ సెంట్రల్, ముంబై నార్త్, ముంబై నార్త్ సెంట్రల్, ముంబై నార్త్ఈస్ట్, ముంబై నార్త్‌వెస్ట్.. ఈ ఆరు నియోజకవర్గాలు సహా మహారాష్ట్రలోని 13 ఎంపీ స్థానాల్లో ఐదో దశలో (మే 20న) పోలింగ్ జరుగనుంది.
3 చోట్ల నువ్వా? నేనా?
శివసేన నుంచి విడిపోయిన రెండు వర్గాలు ముంబైలోని 3 లోక్‌సభ స్థానాల్లో నువ్వా? నేనా? అన్నట్టు తలపడుతున్నాయి. ముంబై సౌత్, ముంబై సౌత్ సెంట్రల్, ముంబై నార్త్‌వెస్ట్‌లో రెండు శివసేనల మధ్య పోటీ ఉండగా.. ముంబై నార్త్‌ఈస్ట్‌లో బీజేపీ వర్సెస్ శివసేన(యూబీటీ) మధ్య పోరు నడుస్తున్నది. ముంబై సౌత్‌లో ఉద్ధవ్ థాక్రే శివసేనకు చెందిన సిట్టింగ్ ఎంపీ అర్వింద్ సావంత్, షిండే నేతృత్వంలోని సేనకు చెందిన యామినీ జాదవ్‌తో తలపడనున్నారు. జాదవ్.. ముంబైలోని బైకుల్లా అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ముంబై సౌత్ సెంట్రల్‌లో షిండే నేతృత్వంలోని సేనకు చెందిన రాహుల్ షెవాలేపై సేన (యూబీటీ) నాయకుడు అనిల్ దేశాయ్ పోటీ పడుతున్నారు. దేశాయ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉండగా, షెవాలే సిట్టింగ్ లోక్ సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ముంబై నార్త్ వెస్ట్‌లో అధికార సేనకు చెందిన రవీంద్ర వైకర్‌తో థాకరే శిబిరానికి చెందిన అమోల్ కీర్తికర్ తలపడనున్నారు. గతంలో సేన(యూబీటీ)లో ఉన్న వైకర్ ఇటీవలే షిండే క్యాంపులో చేరారు.
ప్రస్తుతం ఆయన ముంబైలోని జోగేశ్వరి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ముంబై నార్త్- ఈస్ట్‌లో బీజేపీ అభ్యర్థి మిహిర్ కొటేచాతో సేన(యూబీటీ)కి చెందిన సంజయ్ దిన పాటిల్ తలపడుతున్నారు. కోటేచా.. ములుంద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.
రెండు వర్గాలుగా విడిపోయి పోటీ
శివసేన సీనియర్ నేత ఏక్‌నాథ్ షిండే 34 మంది ఎమ్మెల్యే లతో తిరుగుబాటు చేసి, ఎన్డీయే కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆపై సీఎంగా ప్రమాణ స్వీకారంచేశారు. బీజేపీ మద్దతుతో షిండే వర్గం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గింది. మహారాష్ట్ర అసెంబ్లీ సభ్యుల సంఖ్య 288 కాగా 164 మంది సభ్యుల మద్దతు షిందే వర్గానికి లభించింది. అప్పటినుంచి శివసేన షిండే శివసేన, ఉద్ధవ్ థాక్రే శివసేన(యూబీటీ)గా విడిపోయాయి. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు షిండేకే ఉన్నందున నిజమైన శివసేన ఆయనదే అని స్పీకర్ ప్రకటించారు.
శివసేన నుంచి ఏక్‌నాథ్ షిండేను తొలగించే అధికారం ఉద్ధవ్ థాక్రేకు లేదని, ఆయన రూపొందించిన పార్టీ రాజ్యాంగం కాపీ ఎన్నికల సంఘం వద్ద లేదని స్పీకర్ తన తీర్పులో వెల్లడించారు. ఎన్నికల సంఘం కూడా నిజమైన శివసేన షిండేదే అని ఆయనకే విల్లు-బాణం గుర్తును కేటాయించింది. దీంతో ఈ లోక్‌సభ ఎన్నికల్లో షిండే శివసేన వర్సెస్ ఉద్ధవ్ థాక్రే శివసేన పోటీపై మహారాష్ట్రలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కాంగ్రెస్‌తో ఉద్ధవ్ థాక్రే తొలిసారి దోస్తీ
ముంబై నార్త్సెంట్రల్లో బీజేపీ అభ్యర్థి ఉజ్వల్ నికమ్‌తో కాంగ్రెస్ పార్టీ ముంబై యూనిట్ ప్రెసిడెంట్‌గా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే వర్ష గైక్వాడ్ తలపడనుండగా.. తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థికి ఉద్ధవ్ థాక్రే మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. ఆమె నామినేషన్ దాఖలు చేయగానే, ఉద్ధవ్ థాక్రే ఇంటికి పిలిపించుకొని ఆశీర్వచనాలు అందజేశారు. ఎంపీగా ఢిల్లీకి పంపిస్తానని వర్ష గైక్వాడ్‌కు మాట ఇచ్చారు.
2019 వరకు ముంబైలో కాంగ్రెస్, శివసేన రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నాయి. అయినా, ముంబై సివిక్ బాడీ విషయానికి వచ్చేసరికి అధికారం కోసం ఈ రెండు పార్టీలు పరస్పర అవగాహనతో కలిసి పనిచేశాయి. ఇప్పుడు షిండే శివసేన, బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్‌కు ఉద్ధవ్ థాక్రే డైరెక్ట్‌గా మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.