సికింద్రాబాద్​లో అత్యధికంగా 45 మంది పోటీ : వికాస్​రాజ్

సికింద్రాబాద్​లో అత్యధికంగా 45 మంది పోటీ : వికాస్​రాజ్
  • ఆదిలాబాద్​లో అత్యల్పంగా బరిలో 12 మంది : సీఈవో వికాస్​రాజ్​
  • ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం 

హైదరాబాద్, వెలుగు: నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత  రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల్లో525 మంది అభ్యర్థులు లోక్​సభ ఎన్నికల్లో పోటీలో  ఉన్నారని, అత్యధికంగా సికింద్రాబాద్​ లోక్​సభ నియోజకవర్గం నుంచి 45 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని  రాష్ట్ర ప్రధాన ఎన్నికల​అధికారి (సీఈవో) వికాస్​రాజ్​​ తెలిపారు.  ఆదిలాబాద్​లో అత్యల్పంగా 12 మంది పోటీలో ఉన్నారని వివరించారు.  ఈ నెల 13న లోక్​సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఏర్పాట్లపై బీఆర్కే భవన్​లో బుధవారం వికాస్​రాజ్​ మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో ఓటరు స్లిప్పుల పంపిణీ జరుగుతోందని తెలిపారు. ఎన్నికల విధుల్లో 2.94 లక్షల మంది ఉంటారని వెల్లడించారు. అలాగే, 285 మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారని చెప్పారు.  పోటీలో ఉన్న క్యాండిడేట్ల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్​సభ నియోజకవర్గాల్లో ఏడు స్థానాల్లో మూడు ఈవీఎంలు, 9 స్థానాల్లో రెండేసి ఈవీఎంలు వాడాల్సి వస్తుందన్నారు.  ఆదిలాబాద్​ లోక్​సభ స్థానంలో ఒక్క ఈవీఎం మాత్రమే సరిపోతుందని వివరించారు.  ఒక్క బ్యాలెట్ యూనిట్​లో 15 మంది అభ్యర్థులు, నోటా పెట్టడానికి అవకాశం ఉందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పి అదనంగా కొన్ని ఈవీఎంలు తెప్పిస్తున్నామని తెలిపారు. ఎన్నికల ఫిర్యాదులకు టోల్​ ఫ్రీ నంబరు 1950 ఏర్పాటు చేశామన్నారు. టోల్​ ఫ్రీ నంబర్​ ద్వారా ఇప్పటివరకు 1,227 ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. ఆన్​లైన్​లో వివిధ రకాలుగా 18 వేల ఫిర్యాదులు వచ్చాయని.. అందులో 16 వేలు పరిష్కరించామన్నారు. 

పోలింగ్​ శాతం పెంచడానికి ప్రయత్నిస్తున్నాం

రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల 32 లక్షల 32 వేల 318 మంది ఓటర్లు ఉన్నారని వికాస్​రాజ్​ తెలిపారు.  35,809 పోలింగ్​ స్టేషన్లు ఉన్నాయని అన్నారు. ఇందులో క్రిటికల్​ పోలింగ్​ కేంద్రాలు 9,900 ఉన్నట్టు చెప్పారు. మల్కాజ్​గిరి పార్లమెంట్​పరిధిలో అత్యధికంగా 3,226 పోలింగ్​స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో  మూడంచెల నిఘా ఉంటుందని చెప్పారు. ఇంటర్​ స్టేట్ బార్డర్ ఏరియాల్లో క్షుణంగా పరిశీలన జరుగుతోందన్నారు. అర్బన్ ఏరియాల్లో ఓటు శాతం తక్కువగా ఉందని, పెంచడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు.  ఎన్నికల విధులకు 155 కంపెనీల కేంద్ర బలగాలు వస్తున్నాయని పేర్కొన్నారు. పంటనష్టం పరిహారం కోసం ఈసీ అనుమతి ఇచ్చిందని చెప్పారు.

7,185 కేసులు నమోదు

ఎన్నికలకు సంబంధించి, ఇప్పటి వరకూ వివిధ రకాలుగా 7,185 కేసులు నమోదైనట్టు వికాస్​రాజ్​ తెలిపారు. ఇందులో అత్యధికంగా ప్రొహిబిషన్​ అండ్ ఎక్సైజ్​ శాఖలో 6,560  కేసులు, డ్రగ్స్ అండ్​ నార్కొటిక్స్​ కింద 287, ఐపీసీ కేసులు 309, రిప్రజెంటేటివ్​ యాక్ట్​ (ఆర్ పీ) కింద 21 కేసులు నమోదైనట్టు వివరించారు. ఇప్పటి వరకు రూ. 81 కోట్ల నగదు,  రూ. 46 కోట్ల విలువైన లిక్కర్, రూ. 26 కోట్ల డ్రగ్స్, రూ. 27 కోట్ల ఇతరత్రా అన్ని కలిపి రూ.212 కోట్లు సీజ్​ చేసినట్టు వికాస్​రాజ్​ వెల్లడించారు.

5, 6వ తేదీల్లో హోం ఓటింగ్​ 

ఇంటి దగ్గర ఓటు వేసేందుకు 24,974  మంది అప్లై చేసుకోగా.. 23,248 మంది అప్లికేషన్లకు అనుమతి ఇచ్చినట్టు వికాస్​రాజ్​ తెలిపారు. ఇందులో సీనియర్​ సిటిజన్స్​ 10,362 మంది, దివ్యాంగులు 11,032, అత్యవసర సర్వీసులకు సంబంధించి 1,854 మంది ఉన్నారని వివరించారు. ఈ నెల 5,6వ తేదీన తమ సిబ్బంది వెళ్తారని, ఇంటి దగ్గర ఓటు వేసేవాళ్లు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.  ఇంటివద్ద ఓటు వేసేందుకు అనుమతి పొందిన వాళ్లు.. పోలింగ్​స్టేషన్​ కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేదని స్పష్టం చేశారు.