Dravid– Gill: భారత మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ కి అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అవార్డుగా పేరుగాంచిన సీకే నాయుడు లైమ్ అచీవ్మెంట్ అవార్డును ద్రవిడ్ సొంతం చేసుకోనున్నాడు. మార్చి 15వ తేదీన ఢిల్లీ వేదికగా బీసీసీఐ వార్షిక అవార్డుల సెలబ్రేషన్స్ జరగనున్నాయి. ఈ వేడుకలోనే రాహుల్ అత్యున్నత పురస్కారాన్ని అందుకోనున్నారు. కాగా ఇదే వేడుకలో టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 'క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు తీసుకోనున్నారు. ఇక దేశవాలీ క్రికెట్లో వన్డే ఫార్మాట్లో ఆల్ రౌండర్ గా గతేడాది అద్భుత ప్రదర్శన చేసిన ఆయుశ్ మాత్రే 'లాలా అమర్నాథ్' అవార్డుని అందుకోనున్నాడు. ఇక ఇండియన్ ఉమెన్స్ టీమ్ మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును తీసుకోనున్నారు.
క్రికెట్లో రాహుల్ ద్రవిడ్ కి ప్రత్యేక స్థానం ఉంది. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ సంయుక్తంగా స్థానం సంపాదించిన ద్రవిడ్ 'ది వాల్' గా గుర్తింపు తెచ్చుకున్నారు. టెస్టు క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్ గా పేరుగాంచిన రాహుల్ ఆల్ టైమ్ బ్యాటర్ గా నిలిచాడు. భారత క్రికెట్లో ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్ ఆడిన ద్రవిడ్.. 2001లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్లో లక్ష్మణ్ తో కలిసి 376 రన్స్ రికార్డు భాగస్వామ్యం నెలకొల్పడంతో.. ఆ మ్యాచ్లో మెన్ ఇన్ బ్లూ టీమ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
అయితే క్రికెట్ కి వీడ్కోలు చెప్పిన అనంతరం కోచ్ గా ద్రవిడ్ పని చేశాడు. 2018లో భారత్ అండర్-–19 వరల్డ్ కప్ గెలవడంలో కీ రోల్ పోషించాడు. కప్ గెలిచిన జట్టులో శుభ్‌మన్ గిల్, పృథ్వీ షాలు సభ్యులుగా ఉన్నారు. ఒకప్పుడు గురువు శిక్షణలో అండర్–-19 ప్రపంచకప్ సాధించిన గిల్ ఇప్పుడు తన గురువుతో కలిసి ఒకే వేదికపై క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకోబోతున్నాడు. ఇక 2021లో భారత జట్టు హెడ్ కోచ్ గా ఎంపికైనా తర్వాత రాహుల్ ద్రవిడ్ తనదైన మార్క్ చూపించాడు. ద్రవిడ్ హయాంలోనే ఇండియన్ టీమ్ 2023 వన్డే వరల్డ్ కప్ రన్నరప్ గా, 2024లో టీ20 ప్రపంచకప్ విజేతగా అవతరించింది.
