భారత జట్టుకి కొత్త ఫీల్డింగ్ కోచ్.. ఇంతకీ ఎవరీ శుభదీప్ ఘోష్? 

భారత జట్టుకి కొత్త ఫీల్డింగ్ కోచ్.. ఇంతకీ ఎవరీ శుభదీప్ ఘోష్? 

India New Fielding Coach: ఆగస్టు 15వ తేదీ నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న 2-టెస్టుల సిరీస్‌కు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా అస్సాం మాజీ క్రికెటర్ శుభదీప్ ఘోష్ (Subhadeep Ghosh) ను నియమించింది. ఇప్పటి వరకు ఫీల్డింగ్ కోచ్‌గా పని చేసిన టీ దిలీప్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లలో భారత జట్టు ఫీల్డింగ్ తీవ్రంగా నిరాశపరిచింది. కీలక సమయాల్లో వచ్చిన క్యాచ్‌లని నేలపాలు చేయడం, బౌండరీలు మిస్ చేయడం జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ క్రమంలో శ్రీలంక సిరీస్ ముందే ఫీల్డింగ్ ప్రమాణాలను మెరుగుపర్చేందుకు బీసీసీఐ ఈ మార్పులు చేసింది. 

ఇంతకీ ఎవరీ శుభదీప్ ఘోష్?: 

1968లో అస్సాంలోని దిగ్బోయ్‌లో జన్మించిన శుభదీప్ ఘోష్‌ను క్రికెట్ వర్గాల్లో అభిమానంగా జాయ్ అని పిలుస్తారు. రైట్ హ్యాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్, ఆఫ్ స్పిన్నర్ అయిన శుభదీప్ 1994–95 సీజన్‌లో అస్సాం, రైల్వేస్ జట్ల తరఫున డొమెస్టిక్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. తన కెరీర్‌లో 17 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు (316 రన్స్), 17 లిస్ట్-ఎ మ్యాచ్‌లు (307 రన్స్ ) ఆడారు. 2004లో ఫస్ట్-క్లాస్, 2005లో లిస్ట్-ఎ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.

కోచింగ్ అనుభవం: 

రిటైర్మెంట్ తర్వాత కోచింగ్ వైపు అడుగులేసిన శుభదీప్ ఘోష్, భారత క్రికెట్ డెవలప్‌మెంట్ సిస్టమ్‌లో సుదీర్ఘ అనుభవం సంపాదించారు. గత 6–7 ఏళ్లుగా నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో పని చేస్తూ, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్గదర్శకత్వంలో యువ క్రీడాకారుల నైపుణ్యాలను తీర్చిదిద్దారు. అలాగే ఇండియా అండర్-19, ఇండియా 'ఎ', భారత మహిళల జట్లకు కోచ్‌గా వ్యవహరించారు. 2021 ఆస్ట్రేలియా పర్యటనలో భారత మహిళల జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా పని చేశారు. ఇటీవల శ్రీలంకలో పర్యటించిన ఇండియా 'ఎ' జట్టు సపోర్ట్ స్టాఫ్‌లో కూడా సభ్యుడిగా ఉన్నారు. ఇక 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్నప్పుడు ఆ జట్టు సపోర్ట్ స్టాఫ్‌లోనే కొనసాగారు. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా వర్క్ చేశారు. 

భారత జట్టులో తొలి సవాల్: 

ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శ్రీలంక 2-టెస్టుల సిరీసే భారత సీనియర్ పురుషుల జట్టుతో శుభదీప్ ఘోష్‌కు మొదటి అధికారిక అసైన్‌మెంట్ కానుంది. ఫీల్డింగ్‌లో టీమిండియాను మళ్లీ అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ఆయన ప్రణాళికలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి మరీ.