తెలుగు ప్రేక్షకులను భయపెట్టేందుకు మరో మిస్టికల్ హారర్ థ్రిల్లర్ సిద్ధమైంది. ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎమ్మెస్ రాజు తెరకెక్కించిన 'అగధ'. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలను పెంచేసింది. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 14న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్రైలర్ ఆరంభంలోనే 'మంత్ర తంత్ర విద్యలకు అందని శక్తి ఉంది... దాని గురించి నాకు తెలియాలి' అంటూ కామాక్షి భాస్కర్ల చెప్పే డైలాగ్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. గర్భిణి మహిమ (ఉల్కా గుప్తా) అనుమానాస్పద ఆత్మహత్య వెనుక దాగి ఉన్న రహస్యాన్ని ఛేదించేందుకు మహాదేవి పాత్రలో కామాక్షి చేసే అన్వేషణ కథకు ప్రధాన బలంగా కనిపిస్తోంది. ఆ దర్యాప్తులో ఆమెకు ఎదురయ్యే 'అగధ' అనే దుష్టశక్తి.. దాని చుట్టూ అల్లుకున్న భయానక సంఘటనలు ట్రైలర్‌ను చివరి వరకు ఉత్కంఠభరితంగా నడిపిస్తాయి.
గోర్ విజువల్స్, రక్తం గడ్డకట్టించే హారర్ ఎలిమెంట్స్, మిస్టరీతో నిండిన సన్నివేశాలు ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా శ్రవణ్ రెడ్డి నెగెటివ్ షేడ్స్‌లో కనిపించిన తీరు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. కామాక్షి భాస్కర్ల తన తీవ్ర భావోద్వేగాలతో కూడిన నటనతో సినిమాను భుజాలపై మోస్తున్నట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది.
అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్, డార్క్ విజువల్స్, ఒళ్లు గగుర్పొడిచే సౌండ్ డిజైన్ కలిసి 'అగధ' ప్రపంచాన్ని మరింత భయానకంగా ఆవిష్కరించాయి. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బాలుసు నిర్మించిన ఈ చిత్రాన్ని అజయ్ కెఆర్ సమర్పిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలను ఎమ్మెస్ రాజు స్వయంగా నిర్వహించారు. జోవికా విజయ్‌కుమార్, సిజ్జు, రోషన్, శ్రేయా రాణి రెడ్డి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆగస్టు 14న గ్రాండ్‌గా విడుదల కానుంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి రికార్డు సృష్టిస్తోందో చూడాలి మరి.
►ALSO READ | Irumudi: ‘ఇరుముడి’ నుంచి బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్.. ‘యాలాలో యాలాలో’తో హార్ట్ టచ్ చేసిన రవితేజ..
