ఆడపిల్ల పెళ్లి చేయడం ఈ రోజుల్లో చాలా కష్టం. వరకట్నం ఇవ్వాలి.. కోరినంత బంగారం, వెండి కానుకలు పెట్టాలి. వీటికి తోడు ప్లాట్లు, భూములు అంటూ.. ఎవరి స్థాయికి తగ్గట్లుగా వారు చేయాల్సి వస్తోంది. వరకట్న నిషేధ చట్టం ఉన్నా ఈ కట్న కానుకల ఆచారం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు పెళ్లి చేయలేక నానా ఇబ్బందులు పడటం, ఉన్న ఆస్తులు అమ్ముకోవడం చూస్తూనే ఉన్నాం. కానీ ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులు ఆడపిల్ల పెళ్లి కోసం ఏకమైన తీరు రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఆదర్శంగా నిలవక మానదు.
ఆదిలాబాధ్ జిల్లా చించూఘాట్ లో అదివాసీలు తీసుకున్న నిర్ణయంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. పేదింటిలో కట్న కానుకల కారణంగా పెళ్లి చేయలేని పరిస్థితి నుంచి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. యువతి దేవుబాయి పెళ్లి కోసం అదివాసీలు అంతా ఏకమయ్యారు. పెళ్లి ఖర్చలు భరించలేని కుటుంబానికి తోడుగా నిలిచారు.
ఇంటింటికి ఐదు వందల రూపాయలు చందా వసూలు చేసి పెళ్లికి అండగా నిలిచారు గ్రామస్తులు. జమచేసిన 55 వేల రూపాయలను పెళ్లి ఖర్చుల కోసం దేవుబాయికి ఇచ్చి తామంతా అండగా ఉన్నామని నిరూపించారు.
ALSO READ : మార్చి 16 నుంచి ఏప్రిల్ 23 వరకు.. తెలంగాణలో హాఫ్ డే స్కూల్స్
అంతే కాకుండా గ్రామం అంతా కలిసి తీసుకున్న మరో నిర్ణయం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం లేదు. పెళ్లిల్లో వరకట్నం, కానుకలు నిషేదిస్తూ నిర్ణయం తీర్మానం చేశారు గ్రామస్థులు. గ్రామస్తుల తీర్మానం ప్రకారం కట్న కానుకలు ఆశించకుండా పెళ్లి చేసుకునేందుకు పెళ్లి కొడుకు కుటుంబం అంగీకరించడంతో గ్రామస్తులు సంతోషించారు. గ్రామ పటేల్ కుమ్ర రాజు అధ్వర్యంలో పెళ్లి కూతురు దేవుబాయికి పెళ్లి ఖర్చులకు కావాల్సిన డబ్బులు ఇచ్చారు గిరిజనులు. ఇది చూసి అందరూ ఇలాగే కట్న కానుకలు నిషేధిస్తే ఆడపిల్ల కుటుంబానికి కష్టాలు తప్పించినట్లవుతుందని భావిస్తున్నారు.
