- పార్టీని బలహీనపరిచే ప్రయత్నమని ఫైర్
ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు స్వార్థ ప్రయోజనాల కోసం వర్గ విభేదాలను రెచ్చగొడుతూ పార్టీని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని డీసీసీ ప్రెసిడెంట్ ఆత్రం సుగుణ మండిపడ్డారు. గురువారం డీసీసీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను కుమ్రం భీం గడ్డపై పుట్టి పెరిగిన ఆదివాసీ బిడ్డనని.. తనను నాన్-లోకల్‌గా చిత్రీకరించడం జిల్లా ప్రజలను, ఆదివాసీ సమాజాన్ని అవమానించడమేనని అన్నారు. ‘నన్ను నాన్ లోకల్ అంటున్న వాళ్లే నాన్ లోకల్’ అని ఫైర్ అయ్యారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కలిసి అభివృద్ధి పనులు ఇప్పిస్తామంటూ కొంతమంది కార్యకర్తలను ప్రలోభాలకు గురిచేసి గాంధీభవన్‌కు తీసుకెళ్లి తనపై ఆరోపణలు చేయించారని అన్నారు.
‘నేను 1995లోనే కాంగ్రెస్ నుంచి ఎంపీటీసీగా గెలిచాను. అప్పటి నుంచి పార్టీ మారలేదు. ఉపాధ్యాయ వృత్తి చేసుకుంటున్న సమయంలో పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చింది. నా పనితీరు, పార్టీ పట్ల నిబద్ధతను గుర్తించి అధిష్ఠానమే నాకు టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా, డీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించింది’ అని అన్నారు. పార్టీ నిర్ణయాన్ని కొంతమంది జీర్ణించుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. అధిష్ఠానం నిర్ణయాలను బహిరంగంగా వ్యతిరేకిస్తున్న వారిపై తగిన సమయంలో చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ, మండల అధ్యక్షుడు రాపర్తి మురళి తదితరులు పాల్గొన్నారు.
