- కేంద్ర రక్షణ శాఖకు దరఖాస్తులు
- ఎంఆర్ఓ కేంద్రాల ఏర్పాటు కోసం మరో ఆరు సంస్థల ఆసక్తి
- ఊపందుకున్న ఎయిర్‌పోర్టు భూసేకరణ పనులు
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు నిర్మాణం దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. భూసేకరణకు రూ.2,278 కోట్ల నిధులు మంజూరు చేయడంతో పనులు ఊపందుకున్నాయి. విమానాశ్రయంతో పాటు భారత వైమానిక దళ శిక్షణ కేంద్రం, పైలట్ శిక్షణ అకాడమీలు, విమానాల మరమ్మతు కేంద్రాల ఏర్పాటుకు ప్రైవేట్ సంస్థలు ముందుకొస్తుండటంతో ఆదిలాబాద్ జాతీయ స్థాయి ఏవియేషన్ హబ్‌గా రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆదిలాబాద్‌లో పైలట్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు డీజీసీఏ గుర్తింపు పొందిన ఫ్లెటెక్ ఏవియేషన్ అకాడమీ, వింగ్ ఏవియేషన్ అకాడమీలు ఆసక్తి చూపాయి. పైలట్ లైసెన్సులు, రేటింగ్‌లు, విమానాల నిర్వహణకు సంబంధించిన శిక్షణను ఈ కేంద్రాల్లో అందించనున్నారు. ఈ అకాడమీల ఏర్పాటుతో జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు.
ఆరు ఎంఆర్ఓ కేంద్రాలకు ప్రతిపాదనలు..
విమానాల నిర్వహణ, మరమ్మతులు, ఓవర్‌హాలింగ్(ఎంఆర్ఓ) సేవల కోసం జెట్ సెట్ గో, డెక్కన్, గోల్డెన్ ఈగల్ ఏవియేషన్, స్టార్ ఎయిర్, యథి ఏవియేషన్, థంబై ఏవియేషన్ సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ కేంద్రాల్లో విమానాల ఇంజిన్ల మరమ్మతులు, సాంకేతిక తనిఖీలు, విడిభాగాల నిర్వహణ వంటి సేవలు అందించనున్నారు.
భూసేకరణ పనులు ముమ్మరం..
ఎయిర్‌పోర్టుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. సర్వే, హైటెన్షన్ విద్యుత్ లైన్లు, విద్యుత్ స్తంభాల తరలింపు, డంపింగ్ యార్డు, లాండ్‌సాంగ్వి నుంచి ఆదిలాబాద్‌కు వచ్చే ప్రధాన పైప్‌లైన్ మార్పిడి పనులకు కార్యాచరణ సిద్ధమవుతోంది. భూముల హద్దులను అధికారులు గుర్తిస్తుండగా, రైతులతో చర్చలు కొనసాగుతున్నాయి. న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా రికార్డులను పరిశీలిస్తున్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో భూమి చదును, చెత్త, పిచ్చిమొక్కల తొలగింపు పనులు కొనసాగుతున్నాయి.
డిసెంబర్ లోపే..
డిసెంబర్ 31లోగా భూసేకరణ పూర్తి చేసి సంబంధిత ఏజెన్సీలకు భూములు అప్పగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎయిర్‌పోర్టుకు అనుసంధానంగా 100 అడుగుల వెడల్పుతో ప్రధాన రహదారి నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. భూసేకరణ పురోగతిపై శుక్రవారం హైదరాబాద్‌లో ప్రత్యేక అధికారి వికాస్ రాజ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరగనుండగా, జిల్లా కలెక్టర్‌తో పాటు అన్ని శాఖల అధికారులు హాజరుకానున్నారు.
అభివృద్ధి దిశగా ఆదిలాబాద్
ఆదిలాబాద్‌లో ఎయిర్ పోర్టు నిర్మాణంతో ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే ఆ సంస్థలతో సంప్రదింపులు జరిపాం. ఆదిలాబాద్ లో అకాడమీ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపడంతో ఆ సంస్థలకు సంబంధించిన దరఖాస్తులను రక్షణ శాఖకు అందించాం. అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ఆదిలాబాద్ ముందుకెళ్తోంది.
– పాయల్ శంకర్, ఎమ్మెల్యే, ఆదిలాబాద్-
