- గూడ్స్ రైలు ద్వారా జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్చేరిన కోల్
- గని దక్కిన పదేండ్లకు బొగ్గు రవాణా షురూ
- స్వాగతం పలికిన సింగరేణి డైరెక్టర్లు, ఆఫీసర్లు, నేతలు
కోల్‌బెల్ట్/ జైపూర్, వెలుగు: సింగరేణి చరిత్రలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. గురువారం ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు బ్లాక్ నుంచి తెలంగాణలోని జైపూర్ సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గు నిల్వలతో తొలి రైలు చేరుకుంది. రాష్ట్రం బయట ఉన్న గని నుంచి సిగరేణి ఉత్పత్తి చేసిన బొగ్గు థర్మల్ పవర్ యూనిట్‌కు రావడం ఇదే తొలిసారి. బొగ్గు రైలుకు జైపూర్ మండలం పెగడపల్లిలోని ఎస్టీపీపీ ప్లాంట్‌లో సింగరేణి డైరెక్టర్లు ఎల్వి సూర్యనారాయణ(ఆపరేషన్స్), తిరుమల్‌రావు(ఈఎం), ఎస్టీపీపీ ఈడీ సీహెచ్చిరంజీవి, జీఎంలు నరసింహారావు, సూర్యనారాయణరాజు, కార్మిక సంఘాల నేతలు వీరభద్రం, కనీస వేతనాల అమలు కమిటీ చైర్మన్ బి.జనక్‌ప్రసాద్, ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, జీఎం లక్ష్మిపతిగౌడ్ పూజలు చేసిస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్టీపీపీలో పండుగ వాతావరణం నెలకొంది.
-నైనీ గని దక్కిన పదేండ్ల తర్వాత..
ఒడిశా రాష్ట్రం అంగూల్ జిల్లా కరోల్బహాల్లోని నైనీ బొగ్గు బ్లాక్‌ను 2015 ఆగస్టు 13న కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ సింగరేణికి క్యాప్టివ్ మైన్‌గా కేటాయించింది. సింగరేణిలో ప్రస్తుతం ఉన్న ఓపెన్‌కాస్ట్ గనుల్లో ఒక టన్ను బొగ్గు ఉత్పత్తికి 6 నుంచి 7 క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాల్సివస్తుంది. కానీ, నైనీ బ్లాక్ లో ఒక టన్ను బొగ్గు ఉత్పత్తికి కేవలం 2.56 క్యూబిక్ మీటర్ల ఓబీని తొలగిస్తే సరిపోతుంది. దీంతో ఈ గని సింగరేణికి లాభదాయకంగా మారింది. 2015లోనే నైనీ బొగ్గు బ్లాక్ దక్కినా అప్పటి ప్రభుత్వం అవసరమైన అనుమతులు సాధించకపోవడంతో బొగ్గు ఉత్పత్తిలో తీవ్ర జాప్యం జరిగింది. దట్టమైన అటవీ ప్రాంతం కావడం, కోల్ బ్లాక్‌కు వెళ్లడానికి సరైన దారి లేకపోవడం, బొగ్గు లింకేజీ టెండర్ల వివాదం వల్ల ఆలస్యమైంది.
బొగ్గు బ్లాక్ కుప్రత్యేకంగా రైల్వే మార్గం వేయాల్సివచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే నైనీ బ్లాక్‌లో ఉత్పత్తి మీద శ్రద్ధ పెట్టారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 2024 జులైలో నైనీ బ్లాక్ ప్రాంతాన్ని సందర్శించారు. ఆయన రెండుసార్లు ఒడిశా వెళ్లి ఆ రాష్ట్ర సీఎం, ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాపప్రతినిధులతో చర్చించి ఒప్పందాలు చేసుకున్నారు. 2025 ఏప్రిల్16న వర్చువల్‌గా ఆయన హైదరాబాద్ నుంచి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించారు. గనిలో 340.78 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. ఏడాదికి కోటి టన్నుల(10 మిలియన్ టన్నులు) ఉత్పత్తి సామర్థ్యం, 36 ఏండ్ల పాటు గని జీవితకాలం కొనసాగనుంది. ప్రస్తుతం గని నుంచి ఏడాదికి 60 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి కానున్నది. రోజుకు 12 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు సరఫరా చేయడానికి సింగరేణి కంపెనీ ఏర్పాట్లు చేసింది. అగ్రిమెంట్ప్రకారం గనిలో వెలికితీసిన బొగ్గును మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్(ఎస్టీపీపీ)కి సరఫరా చేయాలి.
1,131 కిలోమీటర్ల ప్రయాణం చేసి..
నైనీ బొగ్గు గని నుంచి తొలి బొగ్గు రైలు సుమారు 1,131 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎస్టీపీపీ చేరుకుంది. ఈ నెల 1న నైనీ సమీప హిందోల్ రైల్వే సైడింగ్లో లోడ్ చేసిన తొలి రైల్వే రేక్‌లో 59 బాక్సుల ద్వారా సుమారు 4 వేల టన్నుల జీ-10 గ్రేడ్ బొగ్గు గురువారం చేరుకుంది. ఎస్టీపీపీలో రోజుకు విద్యుత్తు ఉత్పత్తి కోసం 14 వేల టన్నుల బొగ్గును ఉపయోగిస్తున్నారు. 88 వేల టన్నుల బొగ్గు ఎప్పుడు నిల్వ ఉంటుంది. నైనీ నుంచి బొగ్గు రాకతో నిల్వలు మరింతపెరగనున్నాయి.
