చేనేత రంగం భారతదేశపు అతిపెద్ద సంప్రదాయ హస్తకళా పరిశ్రమలలో ఒకటి. లక్షలాదిమంది నేత కార్మికులకు ఇది జీవనాధారంగా నిలుస్తోంది.చేనేత దినోత్సవం ఆవిర్భావం1905 ఆగస్టు 7న కలకత్తా టౌన్‌హాల్లో స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది.ఈ ఉద్యమంలో చేనేత వస్త్రం స్వావలంబనకు, స్వదేశీ భావానికి, స్వాతంత్ర్య సమరానికి ప్రతీకగా నిలిచింది. భారత ప్రభుత్వం 2015 జులైలో ఆగస్టు 7ను అధికారికంగా జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది.
చేనేత రంగం ప్రాముఖ్యత
చేనేతరంగం గ్రామీణ మహిళలు, చిన్న కుటుంబాలు, సంప్రదాయ నేత కుటుంబాలకు జీవనాధారంగా ఉంది. పూర్తిగా చేతితో నేసే చేనేత వస్త్రాలు భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేస్తాయి. చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులను గౌరవించడం, యువతలో చేనేత వస్త్రాల వినియోగంపై అవగాహన పెంచడం, సంప్రదాయ నేత కళలను పరిరక్షించడం, చేనేత రంగానికి మార్కెట్ అవకాశాలను విస్తరించడం, నేత కార్మికుల ఆదాయాన్ని పెంచేందుకు తోడ్పడటం మొదలైన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది.
తెలంగాణ చేనేత వైభవం
తెలంగాణ రాష్ట్రం చేనేత కళకు ప్రసిద్ధి చెందింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా నేత కార్మికుల సంక్షేమం, మార్కెటింగ్, ప్రోత్సాహక కార్యక్రమాల ద్వారా చేనేత రంగ అభివృద్ధికి కృషి చేస్తోంది. చేనేత రంగం గ్రామీణ ఉపాధికి, మహిళల ఆర్థిక సాధికారతకు బలమైన ఆధారంగా నిలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చేనేత రంగానికి సంబంధించి పలు ముఖ్య పథకాలను అమలుచేస్తోంది. చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, నేతన్న బీమా, నేతన్నకు భరోసా, పావలా వడ్డీ పథకం, క్యాష్ క్రెడిట్ సౌకర్యం, తెలంగాణ చేనేత మగ్గం పథకం, నేతన్న హెల్త్ కార్డ్, చేనేత సహకార సంఘాల బలోపేత పథకాలు, హ్యాండ్‌లూమ్ క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమాలు, నూలు, రంగులు, రసాయనాల సబ్సిడీ పథకం, టీఎస్‌సీఓ ద్వారా చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్, ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది.
చేనేత వస్త్రాలను వాడదాం
ఒక చేనేత వస్త్రాన్ని కొనుగోలు చేయడం అంటే కేవలం ఒక చీర లేదా దుస్తులు మాత్రమే కొనడం కాదు. అది నేతన్న కుటుంబానికి ఉపాధిని కల్పించడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడటం, ప్రతి భారతీయుడు పండుగలు, వివాహాలు, ప్రత్యేక సందర్భాలలో కనీసం ఒక చేనేత వస్త్రాన్ని కొనుగోలుచేసి ఉపయోగిస్తే అది వేలాది నేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపినవారు అవుతారు. పద్మశాలి బతుకుబాట అయిన చేనేత వస్త్రాలను ధరించడం, కొనుగోలు చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. చేనేతను ఆదరిద్దాం.
నేతన్నను గౌరవిద్దాం.
- గూడూరు శ్రీనివాస్,
చైర్మన్, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి కోఆపరేటివ్ కార్పొరేషన్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
