మ్యాట్రిమొనీలో పరిచయమై.. పెండ్లి చేసుకుంటానని నమ్మించి..రూ.30 లక్షలు ముంచింది

మ్యాట్రిమొనీలో పరిచయమై.. పెండ్లి చేసుకుంటానని నమ్మించి..రూ.30 లక్షలు ముంచింది
  • మ్యాట్రిమొనీలో పరిచయమై చీట్​ చేసిన మహిళ

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఓ యువకుడిని లవ్ ట్రాప్‌‌లో పడేసి ఓ మహిళ సుమారు రూ.30 లక్షలు మోసం చేసింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన చిదురాల సత్యనారాయణ బైక్ మెకానిక్‌‌గా పనిచేస్తూ తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు. పెళ్లి కాకపోవడంతో మ్యాట్రిమొనీ యాప్‌‌లో వధువును వెతుకుతున్న సమయంలో భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారడంతో రెండు సంవత్సరాలుగా ఆమె పెళ్లి చేసుకుందామని చెబుతోంది. ఇద్దరం కలిసి జీవించాలంటే భూపాలపల్లిలో ఇల్లు ఉండాలని చెప్పడంతో సత్యనారాయణ రామ్‌‌నగర్ ప్రాంతంలో రూ.13 లక్షలతో పాత ఇల్లు కొనుగోలు చేసి, దానికి రూ.7 లక్షలతో మరమ్మతులు చేయించినట్లు తెలిసింది. అంతేగాకుండా ఇతర అవసరాలకు రూ.10 లక్షలు ఖర్చు చేశాడు.

అనంతరం కొంతకాలం ఇద్దరూ కలిసి ఉన్నట్లు సమాచారం. తర్వాత సదరు మహిళ ఆ ఇల్లు తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకుని సత్యనారాయణను దూరం పెట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో ఆమెకు ముందే పెళ్లై భర్త, కూతురు ఉన్న విషయం తెలిసిన సత్యనారాయణ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.