- సంస్థ భూములను 33 నుంచి 90 ఏండ్లకు లీజుకిచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం
- డిపో ఏర్పాటుకు భూములు దొరక్క ఆర్టీసీ సతమతం
- గ్రేటర్ వరంగల్ కు వంద ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించిన కేంద్రం
- బస్సుల నిర్వహణకు ఆరెకరాల విస్తీర్ణంలో డిపో అవసరం
- భూముల కోసం వెతుకుతున్న ఆర్టీసీ
గత బీఆర్‌ఎస్ సర్కార్ చేసిన అనాలోచిత నిర్ణయంతో ఆర్టీసీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ సంస్థ భూములను బీఆర్‌ఎస్ నేతలకు లీజు పేరుతో అప్పనంగా కట్టబెట్టడంతో ఇప్పుడు బస్సులు నిలిపేందుకు చోటు లేని పరిస్థితి నెలకొంది. కేంద్రం వరంగల్ నగరానికి ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించగా.. ఆర్టీసీకి డిపో ఏర్పాటు అనివార్యంగా మారింది. ఆర్టీసీ భూములు లీజుల పేరుతో బీఆర్‌ఎస్ నేతల వద్ద ఉండడంతో.. బయటి భూములను వెతకాల్సి వస్తోంది.
వరంగల్, వెలుగు: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వరంగల్‌లో రూ.వందల కోట్ల విలువైన ఆర్టీసీ భూములను లీజుల పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు 33 నుంచి 90 ఏండ్లకు కట్టబెట్టింది. ఇప్పుడు సంస్థకు అవసరమైన స్థలాలు దొరకక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆర్టీసీ భూములను లీజుకు ఇవ్వొద్దంటూ అప్పటి అపొజిషన్ పార్టీలు, సంస్థ కార్మికులు, నగర ప్రజలు రోడ్డెక్కి ధర్నాలు చేసినా బీఆర్‌ఎస్ సర్కార్ లెక్క చేయలేదు. ఎలక్ట్రిక్ బస్సుల డిపో ఏర్పాటుకు కనీసం 5 నుంచి 6 ఎకరాల భూమి అవసరం కాగా, ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రభుత్వ భూముల కోసం అధికారులు వెతుకుతున్నారు.
మాజీ ఎంపీకి రూ.100 కోట్ల భూములు..
హనుమకొండ హంటర్ రోడ్‌లో మెయిన్ రోడ్‌కు ఆనుకుని ఉన్న ఆర్టీసీ టైర్ రిట్రేడింగ్ యూనిట్‌కు చెందిన సుమారు 16,250 చదరపు గజాల భూమిని గత ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. ఈ భూముల మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. కాకతీయ జూపార్క్, భద్రకాళి బండ్ సమీపంలో ఉన్న ఈ స్థలం కమర్షియల్ ప్రాజెక్టులకు అనుకూలంగా ఉండగా, అప్పటి బీఆర్‌ఎస్ ఎంపీ పసునూరి దయాకర్ కుటుంబ సభ్యుల ‘రోని భారత్ గ్యాస్’ పేరిట నెలకు రూ.4 లక్షల అద్దెకు 2019 మార్చి 20న లీజ్ ఒప్పందం కుదిరింది. ఈ లీజులో మరికొందరు పార్టీ నేతలకు కూడా వాటాలు ఉన్నాయనే ప్రచారం ఉంది.
పాత బస్ డిపో భూములూ లీజ్..
హనుమకొండ ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ ప్రాంతంలోని పాత బస్ డిపో స్టాఫ్ క్వార్టర్స్‌కు చెందిన సుమారు 4,638 చదరపు గజాల భూములను కూడా ‘జుబ్లీ ఇన్ఫ్రా’ పేరిట 33 ఏళ్లకు లీజ్ ఇచ్చారు. గజం ధర రూ.లక్షకు పైగా ఉన్న ఈ భూముల విలువ సుమారు రూ.46 కోట్లుగా అంచనా. నెలకు రూ.3.9 లక్షల అద్దెకు ఒప్పందం కుదిరింది.
వరంగల్‌కు 100 ఎలక్ట్రిక్ బస్సులు..
కేంద్ర ప్రభుత్వం ఫేమ్ ఇండియా పథకం కింద గతంలో 25 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించినప్పటికీ అవి వినియోగంలోకి రాలేదు. తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో వరంగల్ రీజియన్‌కు 112 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించారు. ఏడాదిన్నర నుంచి దాదాపు 100 బస్సులు వరంగల్ నుంచి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం వంటి నగరాలకు నడుస్తున్నాయి. తాజాగా ‘ప్రధానమంత్రి ఈ-బస్ సేవ’ పథకం కింద గ్రేటర్ వరంగల్ నగరంలో నడిపేందుకు మరో 100 ఎలక్ట్రిక్ బస్సులను కేంద్రం మంజూరు చేసింది.
భూముల కోసం అన్వేషణ..
ప్రస్తుతం నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ వరంగల్-2 డిపో నుంచే జరుగుతోంది. నగరంలో కొత్తగా వచ్చే బస్సుల కోసం చార్జింగ్ పాయింట్లు, సర్వీస్ మెయింటెనెన్స్ ఏర్పాటుకు కనీసం 5 నుంచి 6 ఎకరాల స్థలం అవసరం. అయితే గతంలో ఆర్టీసీ భూములు లీజులకు వెళ్లడంతో ఇప్పుడు కొత్త భూములు గుర్తించడం కష్టంగా మారింది. యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణానికే స్థలాలు దొరక్క తలలు పట్టుకుంటున్న క్రమంలో ఆర్టీసీ డిపో కోసం స్థల సేవకరణ సవాల్‌గా మారింది. ఆర్టీసీ అధికారులు, వరంగల్, హనుమకొండ జిల్లాల రెవెన్యూ శాఖ కలిసి ప్రభుత్వ భూముల కోసం అన్వేషణ ప్రారంభించారు.
