వెలుగు ఓపెన్ పేజీ: నేపాల్ బాద్షా బాలెన్షా!

వెలుగు ఓపెన్ పేజీ:  నేపాల్ బాద్షా బాలెన్షా!

నేపాల్​లో  మార్చి 2026లో  జరిగిన  తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఆ దేశ  ప్రతిష్టాత్మక  రాజకీయ పార్టీలన్నీ  తుడిచిపెట్టుకుపోయాయి.  చారిత్రాత్మకమైన  ఎన్నికల  ఫలితాల  కారణంగా  నేపాల్  ప్రపంచవ్యాప్తంగా  వార్తల్లో  నిలిచింది.   నేపాల్​  దేశానికి ఉత్తరాన  చైనా,  దక్షిణాన  భారతదేశం  సరిహద్దులుగా ఉన్నాయి.   నేపాల్​లో  దాదాపు 3 కోట్ల మంది  జనాభా ఉంది.  రాజకీయాల్లోకి అడుగుపెట్టిన  రెండు సంవత్సరాలలోనే  ఒక యువ రాప్  గాయకుడు  బాలెన్​ షా 2022లో  నేపాల్​ రాజధాని  ఖాట్మండుకు  మేయర్  అయ్యాడు. ఆ తరువాత  కేపీ ఓలి  సారథ్యంలోని  ప్రభుత్వాన్ని  పడగొట్టే ఆందోళనలో  యువతరానికి  నాయకత్వం  వహించాడు.   మార్చి 2026లో   సార్వత్రిక  ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరిగాయి,  నేపాల్​ చరిత్రలో   మైలురాయిగా  నిలిచిన  ఈ  జనరల్​  ఎలక్షన్లలో  ఖాట్మండు  మేయర్  బాలెన్ షా  రాజకీయాల్లో  పాతుకుపోయిన  ప్రతి రాజకీయ నేతను ఓడించగలిగాడు. 

నేపాల్  హిందూ రాచరికం 280 సంవత్సరాలకు పైగా ఆ దేశాన్ని పాలించింది.  2008లో  అంతర్గత విభేదాల కారణంగా రాచరిక ప్రభుత్వం కుప్పకూలిపోయింది.  రాచరిక  పాలన పతనం అవడంతో  ఆ దేశంలో మొట్టమొదటిసారి  ప్రజాస్వామ్యబద్ధంగా  2008లో  సార్వత్రిక  ఎన్నికలు  జరిగాయి.  నేపాల్​లో  జరిగిన తొలి జనరల్​ ఎలక్షన్లలో   చైనా  అనుకూల  రాజకీయ పార్టీలు అధికారాన్ని చేజిక్కించుకున్నాయి.  2008  నుంచి 2025 వరకు 18  సంవత్సరాల కాలంలో 15 ప్రభుత్వాలు పాలించాయి.   1951 వరకు  రాచరిక పాలన కొనసాగించి  రాజులు  నేపాల్‌ను  పాలించినప్పుడు..  వారు  పూర్తిగా  భారత దేశ అనుకూల వైఖరిని  అవలంబించారు.  వాస్తవానికి 1947లో  భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అప్పటి  నేపాల్ రాజు  భారతదేశంలో  విలీనం  కావాలని  కోరుకున్నాడు.  కానీ,  1951 తర్వాత  చైనా  టిబెట్‌ను  ఆక్రమించి నేపాల్  పొరుగు దేశంగా మారినప్పుడు, చైనా ఒత్తిడి కారణంగానే  నేపాల్​ రాజులు  భారతదేశం పట్ల తటస్థ  వైఖరిని తీసుకోవలసి వచ్చింది.  నేపాల్‌కు  చైనాతో   పొడవైన  సరిహద్దును కలిగి ఉంది.   నేపాల్​ రాచరిక పాలనపై దృష్టి సారించిన  చైనా నిశ్శబ్దంగా  స్థానిక  కమ్యూనిస్ట్ పార్టీలను  రాజును  పడగొట్టేలాగ ఆందోళన  చేయమని ప్రోత్సహించింది.   2008లో     రాచరిక  పాలనకు  ముగింపు  పలకడంలో   కమ్యూనిస్ట్​  పార్టీలు  విజయం  సాధించాయి.  అత్యంత  ఆసక్తికరమైన  విషయం  ఏమిటంటే,   మన్మోహన్ సింగ్  నేతృత్వంలోని  కాంగ్రెస్​ ప్రభుత్వం  భారతదేశంలో  వరుసగా  రెండోసారి  2008లో  అధికారంలో  ఉండగానే  నేపాల్​లో  కమ్యూనిస్ట్​  పార్టీ ఆఫ్​ నేపాల్​ (మావోయిస్ట్)  విజయం సాధించింది.  2008లో  సీపీఎన్​‌‌– ఎం  చీఫ్​ ప్రచండ (పుష్ప కమల్​ దహల్​) నేపాల్​  ప్రధానమంత్రి  పదవిని  అధిష్టించారు. 

బాలెన్ షా ఎలా అధికారాన్ని
చేజిక్కించుకున్నాడు?

నేపాల్‌లో  గత 40  సంవత్సరాల్లో  క్రియాశీలకంగా ఉన్న  సంప్రదాయ  రాజకీయ  నాయకులు  పూర్తిగా ఆధిపత్యం  చెలాయించేవారు.   కానీ,  2008లో  రాచరిక పాలన  పతనం  తర్వాత గడిచిన 18 సంవత్సరాలలో 15  ప్రభుత్వాల  అవినీతి, స్వార్థం,  పూర్తిగా పేలవమైన  పాలనను   ప్రజలు అసహ్యించుకున్నారు.   అవినీతిలో  కూరుకుపోయిన  రాజకీయ వ్యవస్థ ఏ కొత్త రాజకీయ పార్టీకి చోటు  ఇవ్వకపోవడంతో  ప్రజల్లో అసహనం మొదలైనది. మూడు ప్రధాన పార్టీలైన నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్​ (యూఎంఎల్​), మావోయిస్టు పార్టీలలో దేనికీ పూర్తి మెజారిటీ రాకున్నా.. వీటిలోని ఓ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాలను  ఏర్పాటు చేస్తూ  వచ్చాయి.  కానీ, నాయకుల  అధికార తపన, అవకాశవాదం, అవినీతి,  స్వార్థపూరిత రాజకీయాల కారణంగా ఏ ప్రభుత్వమూ సరిగా కొనసాగలేదు.  ఈ  స్థిరపడిన  స్వార్థపూరిత  రాజకీయ  నాయకులను  వదిలించుకోవడానికి  మార్గం కోసం  ప్రజలు చూశారు.  బాలెన్ షా  ఒక రాప్  గాయకుడు.  యువత అభిమానాన్ని పొందాడు. రాజకీయ పార్టీల అవినీతి,  విఫలమైన పాలనకు వ్యతిరేకంగా బాలెన్​ షా నిరసన వ్యక్తం చేసినప్పుడు.. ప్రజలు 2022లో ఆయనను  రాజధాని  ఖాట్మండు  మేయర్‌గా  ఎన్నుకున్నారు. ఆ స్థానం నుంచి బాలెన్ షా  ప్రభుత్వంపై  ధ్వజమెత్తారు.  యువత  నుంచి  భారీ ఆందోళన ప్రారంభమైంది.   ఇది  ఉప్పెనగా మారి  ప్రభుత్వాన్ని  తుడిచిపెట్టేసింది.   ఏక  రాజకీయ పార్టీ  ప్రభుత్వం లేకుండానే  ఎన్నికలు  జరుగుతుండటంతో  బాలెన్ షా  భారీస్థాయిలో  యువతను  సమీకరించాడు.  వారు  మూకుమ్మడిగా  సంప్రదాయ రాజకీయ పార్టీలను ఓడించారు.

బాలెన్ షా పాలనలో విజయం సాధించగలరా?

రాజకీయాలలోకి వచ్చిన  గాయకులు, నటులు  ఎన్నికల్లో  పోటీచేసి  గెలవడం అసాధారణం విషయం కాదు. గతంలోనూ చాలామంది రాజకీయాల్లోకి వచ్చి పాలనలో  తమదైన ముద్రను వేశారు.  నేపాల్‌కు చెందిన బాలెన్ షాతో పోల్చదగిన  వ్యక్తి ఉక్రెయిన్‌కు చెందిన  జెలెన్​స్కీ.   ఉక్రెయిన్​ అధ్యక్షుడు కాకముందు జెలెన్​స్కీ  ఒక  నైట్‌క్లబ్  డ్యాన్సర్,  హాస్యనటుడు.  కానీ,  అవినీతిని  ప్రతిఘటించిన  జెలెన్​స్కీ  ప్రజలలో  ప్రసిద్ధి చెందాడు.  రాజకీయాల్లోకి  ప్రవేశించిన  ఆయన  సంప్రదాయ  నాయకులను ఓడించాడు.  అయితే, జెలెన్​స్కీ  గెలిచినప్పుడు  అతను గొప్ప యుద్ధకాల నాయకుడిగా ఎదుగుతాడని,  గొప్ప రష్యన్ సైన్యాన్ని దాదాపుగా  ఓడించగలడని ఎవరూ ఊహించలేదు.  బహుశా బాలెన్ షాకి  కూడా  జెలెన్​స్కీ లాంటి లక్షణాలు ఉండవచ్చు.  చాలాసార్లు ఎంటర్​టైనర్స్, ​  నటులు... అమాయకులని వారికి  రాజకీయాలు తెలియవని  ప్రజలు అనుకుంటారు. కానీ వాస్తవానికి, నటులు, హాస్యనటులు, వినోదకారులు రాజకీయ నాయకుల కంటే చాలా షార్ప్​గా  ఉంటారు.  ఎందుకంటే వారు తమ ప్రొడక్ట్స్​ అమ్మడానికి ప్రజల  మనస్సును పూర్తిగా  చదవాల్సి ఉంటుంది.   వాస్తవానికి  ఎంటర్​టైనర్స్​ చాలా తెలివైనవారు.

బాలెన్ షాకి సవాళ్లు

భారత్​  వ్యతిరేకిగా మారకుండా బాలెన్ షా జాగ్రత్తగా ఉండాలి.   బాలెన్ షా  తన షిప్​ను  చాలా జాగ్రత్తగా నడిపించాలి.  గత 18 సంవత్సరాలుగా  నేపాల్  శత్రుత్వాన్ని  భారతదేశం చవిచూస్తోంది.  నేపాల్ నాయకులు చైనాను  భారతదేశానికి  వ్యతిరేకంగా ఉపయోగించడానికి  ప్రయత్నించినప్పటికీ అది వారు ఆశించిన స్థాయిలో  ఫలించలేదు.  వాస్తవానికి  నేపాల్  చైనాకు  అనుకూలంగా  మారగానే  భారతదేశం ఎన్నడూ  బాధపడలేదు.  కానీ,  నేపాల్  మాత్రం  భారతదేశం  నుంచి  దూరం కావడం వల్ల  బాధపడాల్సి వచ్చింది.  బాలెన్ షా  నేపాల్​ ప్రజలకు స్వచ్ఛమైన  ప్రభుత్వాన్ని అందించాలి.  కొత్త ఆలోచనలతో  ప్రజలు ముందుకు రావాలి.  బాలెన్ షా యువకుడు,  తెలివైనవాడు.  నేపాల్‌లో 18 సంవత్సరాలలో 15 ప్రభుత్వాలు చేసిన దానికంటే  బాలెన్ షా చాలా మెరుగ్గా  రాణించే అవకాశం ఉంది.  మరోవైపు  నేపాల్​లో  రాయల్​ ఫ్యామిలీ సమస్య కూడా ఉంది. 15 ప్రభుత్వాలు  ఎంత దారుణంగా పాలించాయో చూసి రాచరిక పాలనను తిరిగి తీసుకురావాలనే  డిమాండ్ వచ్చింది.  బాలెన్ షా భారతదేశాన్ని,  మాజీ  నేపాల్  రాజును  ఎలా హేండిల్​ చేస్తాడో చూడాలి.  హాస్యనటుడిని లేదా నటుడిని లేదా  ఎంటర్​టైనర్​ని  ఎప్పుడూ  తక్కువ  అంచనా వేయకండి.  చాలామంది ఎంజీఆర్, ఎన్టీఆర్​లను  రాజకీయాల్లోకి  రాకముందు  తక్కువగా అంచనా వేసి దెబ్బతిన్నారు.

జన్​ జడ్​

నేపాల్​లో ఎందుకు సక్సెస్​ అయింది?  బంగ్లాదేశ్​లో ఎందుకు విఫలమైంది? బంగ్లాదేశ్‌లో  ఆగస్టు 2024లో  జరిగిన ఆందోళనలో  జన్​ జడ్​   ప్రతిపక్ష పార్టీలతో  కలిసి హసీనా బేగం ప్రభుత్వాన్ని పడగొట్టారు. ఆ తర్వాత వారు వెంటనే  మంత్రులుగా మారి 18 నెలలు పాలించారు.  ఈ కాలంలో  బంగ్లాదేశ్ జన్​ జెడ్  అవినీతి,  హింస,  తీవ్రవాదం కారణంగా  ప్రపంచవ్యాప్తంగా అపకీర్తి  తెచ్చుకున్నారు. బంగ్లాదేశ్​ యువత  భారత వ్యతిరేక స్వరాన్ని కూడా తీవ్రంగా తీసుకున్నారు.  కాబట్టి  ఎన్నికలు వచ్చినప్పుడు   జన్​ జడ్​ పార్టీ 300 మందిలో  కేవలం 1 ఎంపీని మాత్రమే  గెలుచుకోగలిగింది.  నేపాల్‌లోని  తాత్కాలిక ప్రభుత్వంలో  బాలెన్ షా,  అతని అనుచరులు ఎటువంటి  మంత్రి పదవులను అధిష్టించలేదు.  అందువల్ల వారు  స్వచ్ఛమైన  ఇమేజ్‌తో  ఎన్నికలకు  వెళ్లారు.  అంతేకాకుండా  నేపాల్‌లో  బాలెన్ షా  ఏ రాజకీయ పార్టీలతోనూ పొత్తు పెట్టుకోలేదు.  ఈ నిర్ణయం నేపాల్​ ప్రజల  మన్ననలు  పొందింది.  అందువల్ల ప్రజలు అతనికి అండగా  నిలిచి  మద్దతు  ఇచ్చారు.  వాస్తవానికి  బంగ్లాదేశ్‌లో  జన్​ జెడ్  మార్పు తీసుకురావడానికి  ప్రయత్నించినా  దుందుడుకు వైఖరితో  ఒక సువర్ణావకాశాన్ని కోల్పోయారు.  బదులుగా బంగ్లాదేశ్​లో జరిగిన ఎన్నికల్లో  పురాతన  సంప్రదాయ పార్టీలలో ఒకటైన  బంగ్లాదేశ్​  నేషనలిస్ట్  పార్టీ (బీఎన్పీ)  విజయం సాధించింది. 

- డా. పెంటపాటి పుల్లారావు 
పొలిటికల్ ఎనలిస్ట్

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.