మీకు దమ్ముందా : బాహుబలి సమోసా.. 30 నిమిషాల్లో తింటే డబ్బే డబ్బు

మీకు దమ్ముందా : బాహుబలి సమోసా.. 30 నిమిషాల్లో తింటే డబ్బే డబ్బు

ముప్పై నిమిషాల్లో 12 కిలోల సమోసా తినగలరా? అయితే, ఈ ఫుడ్డీ ఛాలెంజ్ ను మీరు మిస్ చేసుకోకండి..

మీరు ఆహార ప్రియులైతే, ఇప్పుడు కొంత డబ్బును కూడా గెలుచుకునే అవకాశం ఉంది. మీరట్‌కు చెందిన ఓ స్వీట్ షాప్ దాదాపు 12 కిలోల బరువున్న 'బాహుబలి సమోసా'లను తయారు చేస్తోంది. అంతే కాదు ఈ తినుబండారంతో ఒక సవాలును కూడా విసిరింది. అదేంటంటే 30 నిమిషాల్లో మొత్తం సమోసాను తినమని. అలా చేస్తే రూ. 71వేల నగదు బహుమతిని ఇంటికి తీసుకెళ్లమని చెప్పడం ఇప్పుడు కస్టమర్లను అట్రాక్ట్ చేస్తోంది.

"నలుగురు కుక్‌లు ఆరు గంటల్లో ఒక 12 కిలోల సమోసాను సిద్ధం చేస్తారు. ఈ సమోసాలో బంగాళాదుంపలు, బఠానీలు, మసాలాలు, పనీర్, డ్రై ఫ్రూట్స్  వంటి 7 కిలోల సాంప్రదాయ పూరకాలతో నింపబడి ఉంటుంది. ఇది వేయించడానికి దాదాపు 90 నిమిషాలు పడుతుంది" అని లాల్‌కుర్తిలోని కౌశల్ స్వీట్స్ థర్డ్ జనరేషన్ యజమాని ఉజ్జావల్ కౌశల్ తెలిపారు. పుట్టిన రోజున కేక్‌కు బదులుగా 12 కిలోల సమోసాను కట్ చేయడానికి ఇష్టపడే చాలా మంది వ్యక్తుల నుంచి ఇప్పుడు తనకు ఆర్డర్లు వస్తున్నాయని కూడా ఆయన చెప్పారు.

60 ఏళ్లుగా స్వీట్ల వ్యాపారం చేస్తోన్న కౌశల్‌కు గతేడాది జూలైలో 4 కిలోల బరువున్న భారీ సమోసా తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. తమకు వచ్చిన రెస్పాన్స్ చూసి 8 కేజీలు, 12 కేజీల సమోసాలు కూడా తయారు చేయడం ప్రారంభించామని, 12 కేజీల సమోసా ధర రూ.15వందలు అని, ముందుగా ఆర్డర్లు మాత్రమే తీసుకుంటామని చెప్పారు. చాలా మంది ప్రత్యేక సందర్భాలలో బాహుబలి సమోసాను ఆర్డర్ చేస్తున్నారని, కొందరు మరుసటి రోజు పరాఠాలను తయారు చేయడానికి మిగిలిపోయిన ఫిల్లింగ్‌ను కూడా ఉపయోగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.