T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా షెడ్యూల్, చరిత్ర వివరాలు ఇవే

T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా షెడ్యూల్, చరిత్ర వివరాలు ఇవే

టీ20 ప్రపంచ కప్ కోసం భారత్ క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మంగళవారం(ఏప్రిల్ 30) జట్టును ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన పటిష్ఠమైన జట్టును ఎంపిక చేసింది. ఈ టీమ్‌కు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. వెస్టింసీడ్, అమెరికా వేదికగా 2024 టీ20 ప్రపంచ కప్ జరగనుంది.

జూన్ 1 నుంచి 29 వరకు ఈ పొట్టి సమరం జరగనుంది. భారత్ మ్యాచ్ ల విషయానికి వస్తే ఐర్లాండ్ తో జూన్ 5 న తొలి మ్యాచ్ ఆడనుంది. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న భారత్, పాకిస్థాన్ జట్లు  జూన్ 9 న న్యూయార్క్ సిటీలో తలపడనున్నాయి. 2022 టీ20 వరల్డ్ కప్ లో ఇండో,పాక్ పోరు ఏ రేంజ్ లో జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెల్బోర్న్ లోని 90000 మంది ప్రేక్షకుల మధ్యలో జరిగిన ఈ మ్యాచ్ ను విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ తో టీమిండియాను గెలిపించాడు.

Also Read: రింకూ సింగ్ ఎక్కడ..? చెత్త సెలక్షన్ అంటూ బీసీసీఐపై కృష్ణమాచారి ఫైర్

జూన్ 12 న న్యూయార్క్ లో అమెరికాపై, 15 న కెనడాతో ఫ్లోరిడాలో భారత్ లీగ్ మ్యాచ్ లు ఆడుతుంది. భారత్ తమ గ్రూప్ మ్యాచ్ లన్ని అమెరికాలోనే ఆడబోతుంది. బార్బడోస్ లో ఫైనల్ మ్యాచ్ జూన్ 29 న జరుగుతుంది. ఎన్నడూలేని రీతిలో ఈసారి 20 జట్ల మధ్య పోటీ జరగనుండగా.. మొత్తం 10 వేదికల్లో మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఇందులో ఐదు వేదికలు అమెరికాలో ఉండగా.. మరో ఐదు వేదికలు కరేబియన్‌ దీవుల్లో ఉండనున్నాయి. అమెరికాలోని 5  వేదికలను ఐసీసీ ఇప్పటికే ఖారారు చేసినట్లు సమాచారం. అందులో ఫ్లోరిడాతో పాటు మోరిస్‌విల్లే, డల్లాస్, న్యూయార్క్, లాడారు హిల్ ఉన్నాయి.  .    

భారత్ గెలుపోటములు:

2007 తొలి వరల్డ్ కప్ నుంచి భారత్ టీ20 వరల్డ్ కప్ ఆడుతుంది. ఇప్పటివరకు 44 వరల్డ్ కప్ టీ20 మ్యాచ్ ల్లో 27 మ్యాచ్ ల్లో విజయం సాధించి.. 15 మ్యాచ్ లు ఓడిపోయింది. ఒక మ్యాచ్ టై కాగా.. ఒక మ్యాచ్ లో ఫలితం రాలేదు. 

టీ20 వరల్డ్ కప్ లో భారత్ చరిత్ర:

దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్ ను ధోనీ నాయకత్వంలో టీమిండియా  పాకిస్థాన్ పై ఫైనల్లో గెలిచి టైటిల్ గెలిచింది. ఆ తర్వాత జరిగిన మూడు వరల్డ్ కప్ ల్లో కనీసం సెమీస్ కు చేరలేకపోయింది. 2009, 2010, 2012 సూపర్-8 తో సరిపెట్టుకుంది. 2014 లో ఫైనల్ కు బంగ్లాదేశ్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో ఫైనల్ కు వెళ్లినా రన్నరప్ తో సరిపెట్టుకుంది. ఇక 2016 లో టోర్నీ అంతా బాగా ఆడినా సెమీ ఫైనల్లో వెస్టింసీడ్ చేతిలో పరాజయం పాలయ్యారు. 2021 లో మరోసారి ఘోరంగా విఫలం కాగా.. 2022 లో ఇంగ్లాండ్ పై సెమీ ఫైనల్లో ఓడిపోయారు. దీంతో 2007 తర్వాత టీ20 వరల్డ్ కప్ భారత్ కు అందని ద్రాక్షాగానే మిగిలిపోయింది. 

అత్యధిక పరుగుల వికెట్ల వీరులు 

టీ 20 వరల్డ్ కప్ లో భారత్ తరపున విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేశాడు. విరాట్ 27 మ్యాచ్ ల్లో 1141 పరుగులు చేశాడు. కోహ్లీ తర్వాత వరుసగా రోహిత్ శర్మ (963), యువరాజ్ సింగ్(593), మహేంద్ర సింగ్ ధోనీ(529), గౌతమ్ గంభీర్(524) వరుసగా 2,3,4,5 స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్ విషయానికి వస్తే.. రవి చంద్రన్ అశ్విన్ 24 మ్యాచ్ ల్లో 32 వికెట్లు పడగొట్టి టాప్ లో ఉన్నాడు. రవీంద్ర జడేజా(21), హర్భజన్ సింగ్(16), ఇర్ఫాన్ పఠాన్(16), ఆశీష్ నెహ్రా(15) వరుసగా 2,3,4,5 స్థానాల్లో నిలిచారు.

వ్యక్తిగత అత్యధిక స్కోర్ వీరులు:

టీమిండియా మాజీ బ్యాటర్ సురేష్ రైనా 101 పరుగులతో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. 2010 వరల్డ్ కప్ లో రైనా ఈ ఫీట్ సాధించాడు. బౌలింగ్ లో అశ్విన్ 21 బంతుల్లో 11 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసుకోవడం అత్యుత్తమం. జట్టు అత్యధిక స్కోర్ విషయానికి వస్తే 2007 లో ఇంగ్లాండ్ పై 218 పరుగులు చేసింది.