మార్చి నెల వచ్చేసింది. ఎప్పటిలాగే ప్రతినెల 1వ తేదీన చమురు మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ ధరలను సమీక్షించి సవరించాయి. దింతో హోలీ పండగకి ముందే గ్యాస్ వినియోగదారులకు షాక్ తగిలింది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ల ధర పెరగ్గా.. 14.2 కిలోల వంటింటి LPG సిలిండర్ల ధర స్థిరంగా మారలేదు.
వరుసగా మూడోసారి
దేశంలోని ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు (IOC, HPCL, BPCL) ఈరోజు(మార్చ్ 1) నుండి రెస్టారెంట్లు, హోటల్స్, ధాబాలు ఇతర వ్యాపార అవసరాల కోసం ఉపయోగించే 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్ల ధరను రూ.28 నుండి రూ.31 వరకు పెంచాయి. పెంచిన కొత్త ధర ఈరోజు నుండే అమల్లో వచ్చింది.
అయితే 19 కిలోల సిలిండర్ ధర పెరగడం వరుసగా మూడోసారి. గత నెల అంటే ఫిబ్రవరి 1న రూ.49 పెరగ్గా.. జనవరి 1న ధర రూ.111 పెరిగింది. అంటే కేవలం మూడు నెలల్లో రూ.188 పెరిగింది. సమాచారం ప్రకారం, ఢిల్లీలో 19 కిలోల లేదా వాణిజ్య సిలిండర్ ధర ఇప్పుడు రూ.1,768.50. కోల్‌కతాలో రూ.1,875.50. ముంబైలో రూ.1,720.50, చెన్నైలో రూ.1,929.00కి, తెలంగాణలో రూ.1,961.50కి పెరిగింది.
వంటింటి గ్యాస్ సిలిండర్ ధర :
వంటింట్లో ఉపయోగించే 14.2 కిలోల LPG సిలిండర్ ధర ఈసారి మారలేదు. ఢిల్లీలో దీని ధర రూ.853గా ఉంది, హైదరాబాద్లో రూ. 905, వరంగల్‌లో రూ.924, విజయవాడలో రూ.877.50, విశాఖపట్నంలో రూ.861. చివరిసారి ఏప్రిల్ 8, 2025న మార్పు జరిగింది. అయితే రవాణా, నిర్వహణ ఛార్జీల కారణంగా ప్రాంతాలను బట్టి గ్యాస్ ధరల్లో మార్పులు ఉంటాయి.
పెరిగిన ఏటీఎఫ్ ధరలు
విమాన ఇంధనం (ATF) ధర ఈరోజు నుండి, అంటే మార్చి 1, 2026 నుండి పెరిగింది. ఢిల్లీలో ఒక కిలో లీటర్ ATF ధర ఇప్పుడు $816.91కు చేరుకుంది, ఇంతకు ముందు $778.85 గా ఉంది. మనం రూపాయలలో చూస్తే, 1,000 లీటర్ల ATFకు రూ.96,638.14 చెల్లించాలి.
