సౌతాఫ్రికా అజేయంగా.. 5 వికెట్ల తేడాతో జింబాబ్వేపై విజయం

సౌతాఫ్రికా అజేయంగా.. 5 వికెట్ల తేడాతో జింబాబ్వేపై విజయం

న్యూఢిల్లీ: టీ20 వరల్డ్‌‌ కప్‌‌లో సౌతాఫ్రికా ఓటమన్నదే లేకుండా దూసుకుపోతోంది. సూపర్‌‌–8లో ఆడిన మూడు మ్యాచ్‌‌ల్లోనూ విజయకేతనం ఎగురవేసింది. చిన్న టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో డెవాల్డ్ బ్రెవిస్ (42), ర్యాన్‌‌ రికెల్టన్‌‌ (31), జార్జ్‌‌ లిండే (30 నాటౌట్‌‌) సమయోచితంగా ఆడటంతో.. ఆదివారం జరిగిన మ్యాచ్‌‌లో సఫారీలు 5 వికెట్ల తేడాతో జింబాబ్వేపై నెగ్గారు. టాస్‌‌ గెలిచిన జింబాబ్వే 20 ఓవర్లలో 153/7 స్కోరు చేసింది. సికిందర్‌‌ రజా (73) ఒంటరి పోరాటం చేయగా, మిగతా బ్యాటర్ల నుంచి పెద్దగా సహకారం అందలేదు. తర్వాత సౌతాఫ్రికా 17.5 ఓవర్లలో 154/5 స్కోరు చేసి గెలిచింది.

మూడు ఓవర్లలోనే క్వింటన్‌‌ డికాక్‌‌ (0), మార్‌‌క్రమ్‌‌ (4) వెనుదిరగడంతో సౌతాఫ్రికా14/2తో ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో రికెల్టన్‌‌, బ్రెవిస్‌‌ ఇన్నింగ్స్‌‌ ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆరో ఓవర్‌‌లో ఎవాన్స్‌‌(1/22).. రికెల్టన్‌‌ను ఔట్‌‌ చేయడంతో ప్రొటీస్‌‌ 43/3తో పవర్‌‌ప్లేను ముగించింది. బ్రెవిస్‌‌కు తోడైన డేవిడ్‌‌ మిల్లర్‌‌ (22) నిలకడగా ఆడాడు. 

నాలుగో వికెట్‌‌కు 50 రన్స్‌‌ జోడించి పదో ఓవర్‌‌లో వికెట్‌‌ ఇచ్చాడు. మరో ఎనిమిది రన్స్‌‌ జత చేసి బ్రెవిస్‌‌ కూడా ఔటైనా.. ట్రిస్టన్‌‌ స్టబ్స్‌‌ (21 నాటౌట్‌‌), జార్జ్‌‌ లిండే దంచికొట్టారు. ఆరో వికెట్‌‌కు 53 రన్స్‌‌ భాగస్వామ్యం నెలకొల్పి మరో 13 బాల్స్‌‌ మిగిలి ఉండగానే విజయాన్ని అందించారు. 3 వికెట్లు తీసిన సికిందర్‌‌ రజాకు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.

రజా ఒక్కడే..
ముందుగా బ్యాటింగ్‌‌కు దిగిన జింబాబ్వే ఇన్నింగ్స్‌‌లో సికిందర్‌‌ రజా ఒక్కడే మెరుగా ఆడాడు. సఫారీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌‌ చేయడంతో మరుమణి (7), బ్రియాన్‌‌ బెనెట్‌‌ (15) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. దాంతో జింబాబ్వే 45/2తో పవర్‌‌ప్లేను ముగించింది. ఈ దశలో రజా బ్యాట్‌‌ ఝుళిపించినా రెండో ఎండ్‌‌లో ఒక్కరు కూడా నిలబడలేకపోయారు. 

డియోన్ మైయర్స్ (11), ర్యాన్‌‌ బర్ల్‌‌ (5), టోనీ మున్యోంగా (2) నిరాశపర్చడంతో జింబాబ్వే 87/5తో కష్టాల్లో పడింది. ఈ టైమ్‌‌లో క్లైవ్ మదండే (26 నాటౌట్‌‌) కాసేపు బ్యాట్‌‌ అడ్డేశాడు. రజాతో కలిసి ఆరో వికెట్‌‌కు 39, బ్రాడ్‌‌ ఎవాన్స్‌‌ (8)తో ఏడో వికెట్‌‌కు 20 రన్స్‌‌ జోడించడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. క్వేనా మఫాకా, కార్బిన్‌‌ బాష్‌‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

సంక్షిప్త స్కోర్లు
జింబాబ్వే: 20 ఓవర్లలో 153/7 (రజా 73, క్లైవ్‌‌ మదండే 26*, మఫాకా 2/21). సౌతాఫ్రికా: 17.5 ఓవర్లలో 154/5 (బ్రెవిస్‌‌ 42, రికెల్టన్‌‌ 31, రజా 3/29).