పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోసే 'చమురు' క్షేత్రాలకు పాకాయి. ఇరాన్ తన సుప్రీం లీడర్ మృతికి ప్రతీకారంగా సౌదీ అరేబియా ఆర్థిక మూలాలను దెబ్బతీసే పనిలో పడింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీలలో ఒకటిగా పేరుగాంచిన సౌదీ అరంకోకు చెందిన రాస్ తనురా(Ras Tanura) పై ఇరాన్ డ్రోన్ల వర్షం కురిపించడం సంచలనంగా మారింది.
సౌదీ అరేబియాకు వెన్నెముక అయిన సౌదీ అరాంకో రిఫైనరీపై ఇరాన్ తన అత్యంత ప్రమాదకరమైన షాహెద్-136 డ్రోన్లతో విరుచుకుపడింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో రాస్ తనురా రిఫైనరీలో భారీ మంటలు చెలరేగాయి. ఇది కేవలం సైనిక దాడి మాత్రమే కాదు, ప్రపంచ చమురు సరఫరాను స్తంభింపజేసి, ప్రపంచ దేశాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టే అంశంగా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
BREAKING: 🚨 🇸🇦 Saudi Arabia’s ARAMCO, in Ras Tanura, was hit with an Iranian drone causing for a fire outburst. pic.twitter.com/G56LSVq2Hl
— Breaking news 24/7 (@Breaking7Newss) March 2, 2026
ఈ దాడితో భద్రతా కారణాల దృష్ట్యా సౌదీ అరేబియా తన రాస్ తనురా రిఫైనరీని తాత్కాలికంగా మూసివేసింది. ప్రపంచ మార్కెట్లకు ప్రతిరోజూ లక్షల బ్యారెళ్ల చమురును సరఫరా చేసే ఈ కేంద్రం మూతపడటం అంటే.. గ్లోబల్ ఎకానమీపై పిడుగు పడ్డట్లేనని చెప్పుకోవాలి. దీంతో క్రూడ్ ఆయిల్ మార్కెట్‌ను గత కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ లేనంత పెద్ద సంక్షోభంలోకి నెట్టివేసింది. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ, జరిగిన నష్టం, భవిష్యత్తులో జరిగే దాడుల భయంతో మార్కెట్లు వణికిపోతున్నాయి.
ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ ఇప్పుడు గల్ఫ్ దేశాల ఇంధన వనరులను లక్ష్యంగా చేసుకుంటోంది. సౌదీపై జరిగిన ఈ దాడి వల్ల ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. భారత్ వంటి దేశాలకు ఇది పెద్ద దెబ్బ, ఎందుకంటే మనం ఇంధన అవసరాల కోసం క్రూడ్ గల్ఫ్ దేశాలపైనే ఎక్కువగా ఆధారపడుతుంటాం కాబట్టి.
తాజా దాడి తర్వాత సౌదీ అధికారులు ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయడంతో పాటు, అమెరికా సహకారంతో ప్రతిదాడికి సిద్ధమవుతున్నారు. ఒకవేళ ఈ దాడులు ఇలాగే కొనసాగితే.. అది కేవలం పశ్చిమాసియాకే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
