- 185 రన్స్ భారీ తేడాతో కంగారూల గెలుపు
- 3–0తో సిరీస్ సొంతం.. చెలరేగిన హీలీ, మూనీ
హోబర్ట్: కెరీర్‌లో చివరి వన్డే ఆడిన కెప్టెన్ అలీసా హీలీ (98 బాల్స్‌లో 27 ఫోర్లు, 2 సిక్స్‌లతో 158) భారీ సెంచరీతో చెలరేగడంతో ఇండియాతో వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా అమ్మాయిలు క్లీన్ స్వీప్ చేశారు. బెత్ మూనీ (106 నాటౌట్) కూడా సెంచరీతో దంచికొట్టడంతో.. ఆదివారం జరిగిన మూడో వన్డేలోనూ ఆసీస్ 158 రన్స్ భారీ తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 409/7 స్కోరు చేసింది.
ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లోనే ఫోబీ లిచ్‌ఫీల్డ్ (14) ఔటైనా.. హీలీ ఇండియా బౌలర్లపై విరుచుకుపడింది. జార్జియా వోల్ (62)తో రెండో వికెట్‌కు 104 రన్స్, బెత్ మూనీతో మూడో వికెట్‌కు 145 రన్స్ జత చేసి వెనుదిరిగింది. ఇక్కడి నుంచి మూనీ బ్యాటింగ్ షో చూపెట్టింది.
అనాబెల్ సదర్లాండ్ (23), ఆష్లే గార్డ్‌నర్ (4), తహ్లియా మెక్‌గ్రాత్ (2), జార్జియా వారెహామ్ (1) నిరాశపర్చినా.. మూనీ, నికోలా కెరీ (34 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఇద్దరు ఎనిమిదో వికెట్‌కు 54 రన్స్ జోడించడంతో ఆసీస్ భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. శ్రీచరణి, రేణుకా సింగ్ చెరో రెండు వికెట్లు తీశారు.
ఛేజింగ్‌లో ఇండియా 45.1 ఓవర్లలో 224 రన్స్‌కే ఆలౌటైంది. స్నేహ్ రాణా (44) టాప్ స్కోరర్. జెమీమా రోడ్రిగ్స్ (42), దీప్తి శర్మ (29), ప్రతీకా రావల్ (27), హర్మన్‌ప్రీత్ కౌర్ (25) మోస్తరుగా ఆడారు. స్మృతి మంధాన (0) డకౌటైంది. అలనా కింగ్ 4, వారెహామ్ 2 వికెట్లు పడగొట్టారు. హీలీ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకుంది. ఇరుజట్ల మధ్య ఈ నెల 6 నుంచి పెర్త్‌లో ఏకైక టెస్ట్ జరగనుంది.
