మన దేశంలో పేదరికం, సామాజిక, ఆర్థిక పరిస్థితుల వల్ల కాగిన నూనె వాడకం సర్వసాధారణమైపోయింది. కొన్ని సర్వేల ప్రకారం ఇండియాలో 48 శాతం మంది ప్రజలు వారానికి ఒకటి నుంచి 6 సార్లు బయట దొరికే ఫ్రైడ్ ఫుడ్ తింటున్నారు. మనం తినే స్నాక్స్‌లో 21 శాతం డీప్ ఫ్రై చేసినవే ఉంటున్నాయి.
స్ట్రీట్ వెండర్లు, రెస్టారెంట్లు ఖర్చు తగ్గించుకుని, లాభాలు పెంచుకునేందుకు వాడిన నూనెనే రోజంతా మళ్లీ మళ్లీ వాడుతున్నారు. ఇంత జరుగుతున్నా మన దేశంలో కాగిన నూనె వాడకంపై సరైన నియంత్రణలు లేవు. ప్రజల్లో అవగాహన అస్సలు లేకపోవడం విచారకరమని రిపోర్ట్ పేర్కొన్నది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో హాస్పిటల్స్ నిండిపోవడం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వం తక్షణం స్పందించి ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలని, అధికారులు తనిఖీలు చేపట్టాలని సూచిస్తున్నారు. సైంటిస్టులు కూడా కేవలం ల్యాబ్‌లకే పరిమితం కాకుండా, హోటల్స్‌లో ఏ రకమైన ఆయిల్ వాడుతున్నారో క్షేత్ర స్థాయి సర్వేలు చేయాలని తెలిపారు. సోషల్ మీడియా, వివిధ క్యాంపెయిన్ల ద్వారా ప్రజలకు ఈ నూనె వల్ల వచ్చే అనర్థాలను వివరించాలని, ఇండియాలో మనుషులపై ఈ నూనె ప్రభావం ఎలా ఉందనే దానిపై దీర్ఘకాలిక పరిశోధనలు జరగాలని పిలుపునిచ్చారు.
రీ-హీటెడ్ ఆయిల్ వాడకం వల్ల ప్రధానంగా కొలోన్ క్యాన్సర్ (పెద్ద పేగు క్యాన్సర్) వచ్చే ప్రమాదం పొంచి ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా అకాల మరణాలకు కారణమవుతున్న క్యాన్సర్లలో ఇది రెండో స్థానంలో ఉంది. మనం తీసుకునే ఆహారంలో ఉండే విషతుల్య పదార్థాలే 80 శాతం పేగు క్యాన్సర్లకు కారణమవుతున్నాయని రిపోర్టు స్పష్టం చేసింది. ఇది మాత్రమే కాదు.. మాడిపోయిన నూనె వాడకం వల్ల రక్తనాళాలు కుచించుకుపోయి, రక్త ప్రసరణ దెబ్బతింటుంది.
ఫలితంగా బీపీ విపరీతంగా పెరగడం, గుండె జబ్బులు, డయాబెటిస్‌లాంటి దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముడుతాయి. జంతువులపై చేసిన ప్రయోగాల్లో.. ఇలాంటి నూనెతో చేసిన ఆహారం తిన్నప్పుడు రక్త నాళాలు దెబ్బతినడం, శరీరంలో వాపు రావడం, రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్లు రావడం, డీఎన్ఏ దెబ్బతినడంలాంటివి గమనించినట్లు రిపోర్ట్ వెల్లడించింది.
