ప్రభుత్వ వెడ్డింగ్ కిట్​లో కండోమ్స్.. మధ్యప్రదేశ్​లో అధికారుల నిర్వాకం

ప్రభుత్వ వెడ్డింగ్ కిట్​లో కండోమ్స్.. మధ్యప్రదేశ్​లో అధికారుల నిర్వాకం

భోపాల్: మధ్యప్రదేశ్ సర్కార్ అమలు చేస్తున్న ‘ముఖ్యమంత్రి కన్య వివాహ్’ పథకంపై మరోసారి వివాదం చెలరేగింది. ఈ స్కీమ్ కింద కొత్త జంటలకు అందజేసిన వెడ్డింగ్ కిట్​లో కండోమ్​లు, గర్భ నిరోధక ట్యాబ్లెట్లు ఉండడం చర్చనీయాంశమైంది. ఈ పథకం కింద పేదింటి ఆడపిల్లల పెండ్లికి ప్రభుత్వం రూ.55 వేలు అందజేస్తోంది. ఇందులో భాగంగా సోమవారం ఝాబువా జిల్లాలో 296 జంటలకు అధికారులు సామూహిక వివాహాలు జరిపించారు. నవ దంపతులకు వెడ్డింగ్ కిట్లు అందజేశారు. అయితే వాటిలో కండోమ్​లు, గర్భ నిరోధక ట్యాబ్లెట్లను చూసి అందరూ అవాక్కయ్యారు. ఫ్యామిలీ ప్లానింగ్​పై అవగాహన కల్పించేందుకు ఆరోగ్యశాఖ అధికారులు ఇలా చేసి ఉండొచ్చని జిల్లా అధికారి భూర్సింగ్ రావత్ తెలిపారు. ‘‘ఈ స్కీమ్ కింద రూ.49 వేలు నేరుగా లబ్ధిదారుల అకౌంట్​లో వేస్తాం. మిగతా రూ.6 వేలతో పెండ్లి చేస్తాం. వెడ్డింగ్ కిట్లలో కండోమ్స్, ట్యాబ్లెట్లు ఉన్న విషయం మాకు తెల్వదు” అని చెప్పారు. కాగా, పోయిన నెలలో సామూహిక వివాహాల టైమ్​లో పెండ్లి కూతుళ్లకు ప్రెగ్నెన్సీ టెస్టు చేయడం వివాదాస్పదమైంది.