విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి

  విహారయాత్రలో విషాదం..   కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి

 విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోవడంతో ఐదుగురు విద్యార్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మే 4వ తేదీ శనివార  ఉదయం ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లాలో జరిగింది.

సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) ప్రమోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. డెహ్రాడూన్ IMS కళాశాల విద్యార్థులు విహారయాత్ర కోసం ముస్సోరీకి వచ్చి.. తిరిగి వెళ్తుండగా ఝడిపానీ రోడ్డులో ముస్సోరీ డెహ్రాడూన్ మార్గ్‌లోని పానీ వాలా బ్యాండ్ సమీపంలో కారు అదుపు తప్పి లోతైన గుంటలో పడింది.  కారులో మొత్తం ఆరుగురు ఉండగా వారిలో నలుగురు బాలురు కాగా.. ఇద్దరు బాలికలు. ప్రమాదం జరిగిన తర్వాత సమాచారం అందుకున్న ముస్సోరీ పోలీస్, ఫైర్ సర్వీస్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF)తో సహా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లు  సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. 

ఈ ఘటనలో ప్రమాదస్థలంలోనే నలుగురు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు బాలికలను రక్షించి డెహ్రాడూన్‌లోని ఆసుపత్రికి తరలించారు.  అయితే, తీవ్రంగా గాయపడిన ఓ అమ్మాయి చికిత్స పొందుతూ మరణించింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య ఐదుకు చేరింది. మరో అమ్మాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.