హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో కేటీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. గురువారం (జనవరి 22) సాయంత్రం ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన కేటీఆర్, హరీష్ రావు ఆయనతో సమావేశమయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. 2026, జనవరి 23న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సిట్ నోటీసుల నేపథ్యంలోనే కేసీఆర్‌తో హరీష్, కేటీఆర్ అత్యసరంగా భేటీ అయినట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాల సమాచారం.
ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కేసీఆర్‌తో చర్చించనున్నట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే హరీష్ రావును సిట్ విచారించిన సంగతి తెలిసిందే. దీంతో విచారణలో హరీష్ రావును సిట్ అడిగిన ప్రశ్నలు.. ఇచ్చిన సమాధానాల గురించి ఈ భేటీలో డిస్కస్ చేయనున్నట్లు సమాచారం. హరీష్ రావు విచారణ శైలీ ఆధారంగా రేపటి (జనవరి 23) ఇంటరాగేషన్‌కు కేటీఆర్ సిద్ధం కానున్నట్లు తెలిసింది.
కాగా, స్టేట్ పాలిటిక్స్‌ను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో ఇటీవల స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
సజ్జనార్ పర్యవేక్షణలో 9 మంది సభ్యులను నియమించారు. ఈ క్రమంలో సజ్జనార్ సిట్ ఈ కేసులో దూకుడు పెంచింది. ఇందులో భాగంగానే ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును కస్టడీలోకి తీసుకుని విచారించింది.
అలాగే ఈ కేసులో ఇతర నిందితుల వాంగ్మూలాలు, సేకరించిన సాంకేతిక ఆధారాలతో మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో ట్యాపింగ్ ద్వారా నష్టపోయిన బాధితులు, అధికారులు కాల్ డేటా సహా వాట్సాప్, సోషల్‌మీడియా డేటాను పోలీసులు ఇప్పటికే సేకరించారు.
ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనేది ఇప్పటికే స్పెషల్ టీమ్ ప్రాథమిక సమాచారం సేకరించింది. అధికారుల విచారణ పూర్తి కావడంతో ఇందులో రాజకీయ నాయకుల పాత్రపై సిట్ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే పలువురు రాజకీయ నాయకులకు నోటీసులు జారీ చేసి విచారించింది.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ యాదవ్, అతడి తండ్రిని ఇంటరాగేట్ చేసింది. అనంతరం బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి విచారించింది.
హరీష్ రావు విచారణ ముగిసిన రెండు రోజులకే మరో బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అగ్ర నాయకులకు సిట్ వరుసగా నోటీసులు జారీ చేస్తుండటంతో ఈ కేసులో నెక్ట్స్ ఏం జరగబోతుందని రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
