‘అనన్య రిసార్ట్’ అక్రమాలపై మంత్రి సురేఖ సీరియస్

‘అనన్య రిసార్ట్’ అక్రమాలపై మంత్రి సురేఖ సీరియస్
  •     రెండు నెలల్లో లీజు రద్దు చేసి రిసార్ట్‌‌ను స్వాధీనం చేసుకోవాలని ఆదేశం   

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​నగరం వనస్థలిపురంలోని మహావీర్ హరిణవనస్థలి నేషనల్ పార్క్‌‌లో ఉన్న ‘అనన్య రిసార్ట్’ అక్రమాలపై అటవీ, పర్యావరణ శాఖా మంత్రి కొండా సురేఖ సీరియస్ అయ్యారు. సోమవారం అధికారులతో కలిసి రిసార్ట్‌‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కిచెన్, స్విమ్మింగ్ పూల్, కాటేజీలు అపరిశుభ్రంగా ఉండటంతో అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా రిసార్ట్‌‌ను నడుపుతున్న ప్రైవేట్ సంస్థ,  ఒక్కసారి మాత్రమే ప్రభుత్వానికి పన్ను చెల్లించినట్లు తనిఖీల్లో తేలింది.

పర్యాటకుల నుంచి వసూలు చేసే రుసుములకు ఎలాంటి బిల్లులు ఇవ్వకుండా, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నట్లు గుర్తించారు.  సిబ్బందికి జీతాలు సరిగా ఇవ్వడంలేదని, అకౌంట్​పే కాకుండా ఇతర మార్గాల్లో చెల్లిస్తూ పీఎఫ్, బీమా వంటి కనీస సౌకర్యాలు కల్పించడం లేదని మంత్రి పేర్కొన్నారు.  అక్రమాలకు పాల్పడుతున్న  ప్రైవేట్ సంస్థ లీజును మరో రెండు నెలల్లో రద్దు చేయాలని, రిసార్ట్‌‌ను పూర్తిగా అటవీశాఖ స్వాధీనం చేసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జాతీయపార్కు పరిధిలో ఎకో టూరిజం వన్యప్రాణుల సంరక్షణకు అనుగుణంగా ఉండాలని,  పర్యావరణానికి హాని కలిగించకూడదన్నారు.  తనిఖీల్లో సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్, రంగారెడ్డి డీఎఫ్ఓ రోహిత్ గోపిడి, ఎఫ్డీఓ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.