విచారణకు వెళ్తా.. అడిగినవి చెప్తా: సిట్ నోటీసులపై కేటీఆర్ రియాక్షన్

విచారణకు వెళ్తా.. అడిగినవి చెప్తా: సిట్ నోటీసులపై కేటీఆర్ రియాక్షన్

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలంటూ సిట్ జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. సిట్ విచారణకు వెళ్తా.. వాళ్లు అడిగినవాటికి సమాధానాలు  చెప్తానని అన్నారు. గురువారం (జనవరి 22) సిరిసిల్ల బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక బక్వాస్ కేసని అన్నారు. టీవీ సిరియల్ మాదిరిగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగుతోందని ఎద్దేవా చేశారు. 

శాంతి భద్రతల కోసం, ప్రభుత్వాల అస్థిరత కోసం అధికారులు కొన్ని ఫోన్ కాల్స్ వింటారని పరోక్షంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అంగీకరించారు. అధికారులు ఫోన్ కాల్స్ వింటే తనకేం సంబంధమని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, పాలన చేతకాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ అవినీతి బయటపెడుతున్నామనే హరీష్​ రావుకు, తనకు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. 

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అని పిలిచి హరీష్ రావును అడిగిందే అడిగి టైంపాస్ చేశారు.. రేపు నాతో కూడా అదే చేస్తారన్నారు. ఇప్పుడు నా ఫోన్ ట్యాప్ అవుతోందో లేదో సిట్‌ను అడుగుతానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్యాపింగ్ కేసు విచారణ ప్రారంభించి రెండేళ్లు అవుతోందని.. సిట్ దర్యాప్తు లీకులు తప్ప, అధికారిక ప్రకటన లేదన్నారు. 

►ALSO READ | కేటీఆర్‎కు సిట్ నోటీసులపై స్పందించిన హరీష్ రావు.. ఏమన్నారంటే..?

సీఎం రేవంత్ రెడ్డి విదేశాల నుంచి వచ్చే వరకు టైంపాస్ చేసేందుకే విచారణకు పిలుస్తున్నారని ఆరోపించారు. ముగ్గురు మంత్రుల పంచాయతీలో ముగ్గురు జర్నలిస్టులు బలయ్యారని.. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో బలయ్యేది పోలీసు అధికారులేనని అన్నారు.

 ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇప్పటికే ఏసీబీ విచారణకు 2, 3సార్లు, ఈడీ విచారణకు ఒకసారి వెళ్లానని.. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా విచారణకు హాజరు అవుతానని తెలిపారు. సిట్ అధికారులు అడిగిన వాటికి సమాధానాలు చెప్తానని అన్నారు. 

ఫోన్ ట్యాపింగ్ కేసును న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. చిన్న చిన్న అంశాలపై సిట్ వేస్తోన్న ప్రభుత్వం.. అమృత్ స్కాంలో సీఎం రేవంత్ రెడ్డి బంధువు సృజన్ రెడ్డి అవినీతిపై, కంచె గచ్చిబౌలి భూములపై సిట్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. 

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‎కు గురువారం (జనవరి 22) సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు జూబ్లీహిల్స్ నందినగర్‎లోని కేటీఆర్ నివాసానికి వెళ్లి అధికారులు నోటీసులు అందజేశారు. 2026, జనవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‎లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.