భారతదేశంలో దశాబ్దాలుగా సాంకేతిక రంగంలో కెరీర్ ఆశించే గ్రామీణ, పేద విద్యార్థులకు పాలిటెక్నిక్ విద్య ఒక ప్రధాన మార్గం. డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా నేరుగా ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలోకి ప్రవేశించే అవకాశం ఉండడం దీని ప్రధాన ఆకర్షణ. ముఖ్యంగా ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలతోపాటు వారిని ఉన్నత విద్యకు చేరువ చేసే ఒక వంతెనలాంటిది ఈ డిప్లొమా మార్గం. అయితే, డిప్లొమా విద్యార్థులకు లేటరల్ ఎంట్రీ విధానం ఉండరాదంటూ తెలంగాణ విద్యా కమిషన్ చేసిన ప్రతిపాదన పాలిటెక్నిక్ విద్యపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో భవిష్యత్తులో పాలిటెక్నిక్ కళాశాలల మనుగడ ప్రశ్నార్థకం కావడమే కాకుండా గ్రామీణ, పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉంది.
హైదరాబాద్‌లో మాసబ్‌ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను 1923లో స్థాపించారు. అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, పరిశ్రమలకు సాంకేతికంగా శిక్షణ పొందిన సిబ్బందిని తయారు చేయాలనే ఉద్దేశంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో ఈ కళాశాలను ఏర్పాటు చేశారు. అనంతరం భారతదేశ సాంకేతిక విద్యావ్యవస్థలో అంతర్భాగమైన పాలిటెక్నిక్‌లు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీఈటీ) పరిధిలోకి వచ్చాయి. పరిశ్రమలకు అవసరమైన మధ్యస్థాయి సాంకేతిక నిపుణుల (డిప్లొమా ఇంజినీర్లు)ను తయారుచేయడం పాలిటెక్నిక్‌ల ప్రధాన లక్ష్యం. క్షేత్రస్థాయిలో సూపర్ వైజర్లుగా పనిచేసే ఈ డిప్లొమా ఇంజినీర్లు.. టెక్నీషియన్లు, డిగ్రీ ఇంజినీర్ల మధ్య వారధిలా వ్యవహరిస్తారు.
సాంకేతిక విద్యకు డిమాండ్
తెలంగాణలో 59 ప్రభుత్వ పాలిటెక్నిక్‌లతో కలిపి మొత్తం 128 కళాశాలలు 29 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. వీటిలో సుమారు 30 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. మేటి సాంకేతిక విద్యతోపాటు ఉపాధి, ఉద్యోగాన్ని అందించే డిప్లొమా కోర్సుల్లో ఎక్కువగా పేద, మధ్య తరగతి విద్యార్థులు చేరుతున్నారు. అలాగే ఉన్నత విద్య ఆశించే డిప్లొమా విద్యార్థులు ఇంజినీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈసెట్)తో నేరుగా ఇంజినీరింగ్ రెండో సంవత్సరం కోర్సుల్లో చేరే అవకాశమూ ఉంది. ఉపాధితోపాటు ఉన్నత విద్యకు అవకాశం కల్పించే పాలిటెక్నిక్ విద్యకు తెలంగాణలో మంచి డిమాండ్ ఉంది. గత మూడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో సుమారు 80 శాతం సీట్లు విద్యార్థులతో నిండిపోయాయి. మెకానికల్ ఇంజినీరింగ్‌లాంటి ఒకట్రెండు కోర్సుల్లో మినహా చాలా విభాగాల్లో వందశాతం ప్రవేశాలు నమోదయ్యాయి.
డిప్లొమా పూర్తయిన ప్రతి విద్యార్థికి ఉద్యోగం లభించాలని రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. పరిశ్రమల అవసరాలకు అనుగణంగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంతోపాటు సిలబస్ ప్రక్షాళన చేపడుతున్నారు. ఇందుకోసం ఐఐటీ– హైదరాబాద్ నిపుణులు, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), టాటా టెక్నాలజీ లిమిటెడ్ సంస్థల సహకారాన్ని తీసుకుంటున్నారు.
విద్యా కమిషన్ సిఫార్సులు
రాష్ట్రంలోని పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)లను కార్మికశాఖ నుంచి తప్పించి సాంకేతిక విద్యాశాఖకు అప్పగించడంతోపాటు అన్ని పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తేవాలని తెలంగాణ విద్యా కమిషన్ పేర్కొంది. డిప్లొమా విద్యార్థులు నేరుగా ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో చేరే లేటరల్ ఎంట్రీ విధానాన్ని రద్దు చేయాలని ప్రతిపాదించింది. పాలిటెక్నిక్ విద్యను ఇంటర్మీడియట్‌కు సమానంగా పరిగణించింది. వారికి ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలోనే ప్రవేశం కల్పించాలని సూచించింది.
పాలిటెక్నిక్‌ల మనుగడకే ప్రమాదం
ఇంటర్మీడియట్ ద్వారా బీటెక్‌లో చేరాలంటే విద్యార్థులు కార్పొరేట్ కళాశాలల్లో లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం సుమారు 70 శాతం మంది డిప్లొమా విద్యార్థులు ఇంజినీరింగ్‌లో చేరుతున్నారు. కమిషన్ ప్రతిపాదన ఆ వంతెనను బలహీనపరిచేలా ఉంది. లేటరల్ ఎంట్రీ రద్దుతో పాలిటెక్నిక్‌లు ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది. విద్యార్థులు మూడేళ్ల పాలిటెక్నిక్ విద్యకు బదులు రెండేళ్ల ఇంటర్ వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. ఫలితంగా పాలిటెక్నిక్‌లలో ప్రవేశాలు తగ్గిపోవడంతోపాటు దీర్ఘకాలంలో వాటి మనుగడే ప్రశార్థకంగా మారే ప్రమాదం ఉంది. ఇంజినీరింగ్ చదవాలనుకున్న పేద విద్యార్థులకు ఈ నిర్ణయం ఒక శరాఘాతం కానుంది.
లేటరల్ ఎంట్రీ విధానాన్ని కొనసాగించాలి
లేటరల్ ఎంట్రీ విధానాన్ని కొనసాగిస్తూనే డిప్లొమాతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. పాలిటెక్నిక్ కళాశాలలు, పరిశ్రమల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేసి, ప్రాంగణ నియామకాల అవకాశాలను విస్తరించాలి. అలాగే, ఉద్యోగం చేస్తూనే పార్ట్–టైం పద్ధతితో బీటెక్ అభ్యసించేందుకు ప్రోత్సహిస్తే విద్యార్థులకు మరింత ప్రయోజనం కలుగుతుంది. మన దేశంలో సాంకేతిక విద్యలో పాలిటెక్నిక్‌లది కీలకపాత్ర. ప్రభుత్వ విధానాలు వాటి బలోపేతానికి దోహదపడాలి. కానీ, వాటి బలహీనతకు కారణం కాకూడదు. డిప్లొమా ఒక డెడ్–ఎండ్ అర్హతగా మారిపోకుండా... నైపుణ్య ఉపాధికి, ఉన్నత విద్యకు ఒక వంతెనలా పాలిటెక్నిక్‌లు కొనసాగాలి.
- డా. అజేయ్ శివర్ల,
ఇంగ్లిష్ లెక్చరర్
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
