తెలంగాణ మట్టి వీరత్వాన్ని చాటిచెప్పే 'గొల్ల రామవ్వ'.. డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?

తెలంగాణ మట్టి వీరత్వాన్ని చాటిచెప్పే 'గొల్ల రామవ్వ'.. డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?

తెలంగాణ మట్టిలో పుట్టిన వీరగాథ, భారత మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు గారి కలం నుంచి జాలువారిన అద్భుత గాథ "గొల్ల రామవ్వ". ఇప్పుడు ఇది వెండితెర దృశ్యకావ్యంగా మన ముందుకు రాబోతోంది. చారిత్రక నేపథ్యం, భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం నేరుగా ఓటీటీ వేదికగా విడుదలకు సిద్ధమైంది. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఒక సామాన్య మహిళ చూపిన అసామాన్య ధైర్యసాహసాల సమాహారమే ఈ 'గొల్ల రామవ్వ'. ఈ కథను దర్శకుడు ముళ్ళపూడి వరా తెరకెక్కించారు. 

ట్రైలర్ ఆవిష్కరణ

ఇటీవల జరిగిన ట్రైలర్ లాంచ్ వేడుకకు పి.వి. నరసింహారావు కుమారుడు పి.వి. ప్రభాకరరావు, కుమార్తె ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. "మా నాన్నగారు రాసిన అద్భుతమైన కథను నేటి తరానికి అర్థమయ్యేలా, విజువల్స్‌తో అద్భుతంగా ఆవిష్కరించారు అని వారు చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ వేడుకలో రాజీవ్ కనకాల, కాసర్ల శ్యామ్, యాటా సత్యనారాయణ వంటి ప్రముఖులు పాల్గొని సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేశారు.

►ALSO READ | Thalapathy Vijay: 'జననాయగన్' కు ఓటీటీ సంస్థ షాక్.. రూ. 120 కోట్ల డీల్ పై హెచ్చరిక?

ఒకప్పటి 'సీతామాలక్ష్మి' తాళ్ళూరి రామేశ్వరి గొల్ల రామవ్వగా పవర్‌ఫుల్ పాత్రలో నటించారు. ఆమె నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుంది. అల్లు గీత, అన్విత్, మణి మంతెన కీలక పాత్రల్లో మెరిశారు. సాయి మధుకర్ అందించిన బాణీలు, నేపథ్య సంగీతం తెలంగాణ మట్టి వాసనను ప్రతిబింబిస్తాయి.  సుచేత డ్రీమ్ వర్క్స్ మరియు వర్మ డ్రీమ్ క్రియేషన్స్ పతాకాలపై రామ్ విశ్వాస్ హనూర్కర్, రాఘవేంద్రవర్మ (బుజ్జి) నిర్మించారు.ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన అజహర్ షేక్ ఈ చిత్రానికి మనసును తాకే సాహిత్యాన్ని కూడా అందించారు.

రిపబ్లిక్ డే సందర్భంగా ఓటీటీలోకి..

గతంలో 'మౌనమే నీ భాష' వంటి క్లాసిక్ చిత్రాన్ని అందించిన టీమ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. రజాకార్ల అకృత్యాలకు వ్యతిరేకంగా ఒక తల్లి చేసిన పోరాటం, ఆమె చాకచక్యం ఇందులో కీలకం. నేటి తరానికి తెలంగాణ చరిత్రను, మన పూర్వీకుల త్యాగాలను తెలియజేసే అరుదైన చిత్రమిది. ముఖ్యంగా పి.వి. నరసింహారావు గారి రచనల్లోని లోతును, తెలంగాణ భాషా సౌందర్యాన్ని ఈ సినిమా ద్వారా మరోసారి అనుభవించవచ్చు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్  లో స్ట్రీమింగ్ కానుంది.