తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఇటీవల నటించిన చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) . సినిమాలకు గుడ్ బై చెబుతూ ఇకపై తన దృష్టి అంతా పూర్తిగా రాజకీయాలపై పెడుతున్నారు. ఇదే ఆయన ఆఖరి చిత్రం కావడంతో పై ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ మూవీ.. సెన్సార్ వివాదంతో వాయిదా పడింది. అయితే, ఈ సినిమాకు కష్టాలు మాత్రం ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. సెన్సార్ వివాదంతో మొదలైన ఈ సినిమా ప్రయాణం, ఇప్పుడు ఓటీటీ ఒప్పందాల వరకు వెళ్లి నిర్మాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
'జన నాయకన్' సెన్సార్ చిక్కులు
విజయ్ తన రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (TVK) పనుల్లో బిజీ కాకముందే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. నిజానికి ఈ చిత్రం జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. కానీ, సినిమాలోని కొన్ని పొలిటికల్ డైలాగులు ,సన్నివేశాల కారణంగా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో చిత్ర నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న కోర్టు ప్రస్తుతం తన తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియని సందిగ్ధంలో సినిమా భవిష్యత్తు ఊగిసలాడుతోంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో షాక్..
సినిమా థియేట్రికల్ విడుదల ఆలస్యం కావడం డిజిటల్ పార్ట్‌నర్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోకు ఆగ్రహం తెప్పించింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సుమారు రూ. 120 కోట్లకు కొనుగోలు చేసింది. థియేటర్లలో విడుదలైన నిర్ణీత రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనేది అగ్రిమెంట్. కానీ సినిమా రిలీజ్ డేట్ ఖరారు కాకపోవడంతో, తమ బిజినెస్ ప్లాన్స్ దెబ్బతింటున్నాయని అమెజాన్ ప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒప్పంద నిబంధనల ఉల్లంఘన కింద నిర్మాతల పై చట్టపరమైన చర్యలు తీసుకోవడమా?, లేదా అగ్రిమెంట్ మొత్తాన్ని తగ్గించుకోవడమా ?(Price Reduction) అన్న ప్లాన్ లో ఓటీటీ సంస్థ ఉన్నట్లు సమాచారం.
ఎలక్షన్ కోడ్ భయం..
మరో వైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తేదీలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఒకసారి ఎన్నికల కోడ్ (Model Code of Conduct) అమల్లోకి వస్తే, రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాల విడుదలకు మరిన్ని అడ్డంకులు ఎదురవుతాయి. విజయ్ రాజకీయాల్లోకి వెళ్తున్న తరుణంలో, ఈ సినిమాలోని డైలాగులు ఓటర్లను ప్రభావితం చేస్తాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే, ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే సినిమాను ఎలాగైనా విడుదల చేయాలని చిత్ర బృందం రాత్రింబవళ్లు శ్రమిస్తోంది.
ఒకవైపు అభిమానులు తమ అభిమాన హీరో ఆఖరి సినిమాను థియేటర్లలో చూడాలని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటే, మరోవైపు న్యాయపరమైన చిక్కులు, ఓటీటీ సంస్థల ఒత్తిడి మేకర్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మద్రాస్ హైకోర్టు తీర్పుపైనే ఇప్పుడు ఈ 'జన నాయగన్' జాతకం ఆధారపడి ఉంది.
