టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లా ఔట్: ఇండియాలో ఆడొద్దని బీసీబీ సంచలన నిర్ణయం

టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లా ఔట్: ఇండియాలో ఆడొద్దని బీసీబీ సంచలన నిర్ణయం

ఢాకా: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియా, శ్రీలంక సంయుక్తంగా అతిథ్యమిస్తోన్న 2026 టీ20 వరల్డ్ కప్ ఆడొద్దని నిర్ణయించుకుంది. ఇటీవల బంగ్లాదేశ్, ఇండియా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించడంతో భద్రత పరమైన కారణాల వల్ల ఇండియాలో వరల్డ్ కప్ మ్యాచులు ఆడలేమని.. తమ మ్యాచులను ఇండియా బయట తటస్థ వేదికలకు తరలించాలని బ్లంగా క్రికెట్ బోర్డు ఐసీసీని కోరింది. 

లేదంటే తమ జట్టును గ్రూప్–సి నుంచి గ్రూప్–బికి మార్చాలని మరో ప్రతిపాదన తీసుకొచ్చింది. అయితే.. ఇప్పటికే టోర్నీ షెడ్యూల్ ఫిక్స్ కావడంతో బీసీబీ అభ్యర్థనలను ఐసీసీ తిరస్కరించింది. ఇండియాలో ఆడాల్సిందేనని.. లేదంటే టోర్నీ నుంచి తప్పుకోవాలని ఐసీసీ అల్టిమేటం జారీ చేసింది. దీంతో ఇండియాలో ఆడేందుకు ఇష్టపడని బంగ్లాదేశ్ వరల్డ్ కప్ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం (జనవరి 22) ప్రకటించింది.

దీంతో మెగా టోర్నీలో బంగ్లా ఆడుతుందా.. లేదా..? అని గత కొద్దిరోజులుగా నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది. టోర్నీ నుంచి బంగ్లా వైదొలగడంతో ఆ జట్టు స్థానంలో మరో టీమ్‎ను ఐసీసీ భర్తీ చేయనుంది. వరల్డ్ కప్ క్యాలిఫయర్ మ్యాచ్ పాయింట్ల ఆధారంగా బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ టీ20 వరల్డ్ కప్ ఆడే అవకాశం ఉంది. 

ఇండియాలో నాలుగు లీగ్ మ్యాచ్ లు:

భారత్‌, శ్రీలంక ఆతిథ్య దేశాలుగా 2026, ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8వ తేదీ వరకు టీ20 వరల్డ్ కప్ జరగనుంది. టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం ఇండియాలో బంగ్లాదేశ్ మొత్తం నాలుగు లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. మూడు కోల్‌కతాలో ఒకటి ముంబైలో జరగనుంది. ఫిబ్రవరి 7న వెస్టిండీస్, ఫిబ్రవరి 9న ఇటలీ, ఫిబ్రవరి 14న ఇంగ్లాండ్ తో కోల్‌కతాలో మ్యాచ్ లు ఆడనుంది. ఫిబ్రవరి 17న ముంబైలో నేపాల్‎తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. టోర్నీ నుంచి బంగ్లా తప్పుకోవడంతో ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

►ALSO READ | Indonesia Masters 2026: క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లిన సింధు.. 500 విజయాలతో తొలి ఇండియన్ ప్లేయర్‌గా హిస్టరీ