Indonesia Masters 2026: క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లిన సింధు.. 500 విజయాలతో తొలి ఇండియన్ ప్లేయర్‌గా హిస్టరీ

Indonesia Masters 2026: క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లిన సింధు.. 500 విజయాలతో తొలి ఇండియన్ ప్లేయర్‌గా హిస్టరీ

భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు ఇండోనేషియా మాస్టర్స్ లో సత్తా చాటుతోంది. ఈ టోర్నీలో అద్భుతంగా ఆడుతూ వస్తున్న సింధు క్వార్టర్ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. గురువారం (జనవరి 22) జకార్తాలో జరిగిన రౌండ్-ఆఫ్-16 మ్యాచ్‌లో డెన్మార్క్‌కు చెందిన లైన్ క్జెర్‌ఫెల్డ్ట్‌పై వరుస గేమ్ లలో విజయం సాధించింది. 43 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ లో క్జెర్‌ఫెల్డ్ట్‌పై సింధు 21-19, 21-18 తేడాతో విజయం సాధించింది. క్జెర్‌ఫెల్డ్ట్‌పై సింధుకు ఇది ఆరు మ్యాచ్ ల్లో ఐదో విజయం కావడం విశేషం. 

ఈ విజయంతో సింధు మరో మైల్ స్టోన్ ను అందుకుంది. బ్యాడ్మింటన్ లో ఇండియా తరపున  500 విజయాలు సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు సింధు తన కెరీర్ లో 732 మ్యాచ్‌లు ఆడితే 500 విజయాలు సాధించింది. ఆమె  విజయాల శాతం 68.3. క్వార్టర్ ఫైనల్లో టోర్నమెంట్ టాప్ సీడ్.. ప్రపంచ 4వ ర్యాంక్‌లో ఉన్న చెన్ యు ఫీతో తలపడనుంది. ఓవరాల్ గా వీరిద్దరి మధ్య 13 మ్యాచ్ లు జరిగితే సింధు 7-6 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే రెండు గేమ్ లలో మ్యాచ్ ముగిసినా హోరాహోరీగా ఇద్దరి మధ్య ఆట సాగింది. తొలి సెట్ లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టు ఆడడంతో ఇద్దరూ 19-19 తో నిలిచారు. ఈ దశలో సింధు ఒత్తిడిని అధిగమిస్తూ వరుసగా రెండు కీలక పాయింట్లు సాధించి తొలి గేమ్ ను సొంతం చేసుకుంది. రెండో గేమ్ లోనూ దాదాపు ఇదే సీన్ రిపీట్. ఇద్దరూ 18-18 వద్ద ఉన్నప్పటికీ సింధు మరోసారి ఆధిపత్యం చూపించి రెండో గేమ్ ను గెలిచి మ్యాచ్ లో విజయం సాధించింది.

మెన్స్ విభాగంలో లక్ష్య సేన్ కూడా క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నాడు. గురువారం (జనవరి 22) అరగంటకు పైగా జరిగిన రౌండ్ 16 లో లక్ష్య సేన్ పూర్తి ఆధిపత్యం చూపించాడు. హాంకాంగ్‌కు చెందిన జాసన్ గుణవన్‌పై 21-10, 21-11 తేడాతో అలవోకగా గెలిచి క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లాడు.