అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్‌ల్యాండ్ వ్యవహారంలో తన దూకుడును తగ్గించడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ పరిణామం దేశీయ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ETFs) పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. జనవరి 22న ట్రేడింగ్‌లో గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్‌లు భారీ నష్టాలను నమోదు చేశాయి.
గ్రీన్‌ల్యాండ్ డీల్‌తో తగ్గిన ఉద్రిక్తతలు..
గ్రీన్‌ల్యాండ్ ద్వీపాన్ని దక్కించుకునే విషయంలో గత కొన్ని రోజులుగా అమెరికాకు.. ఐరోపా దేశాలకు మధ్య తీవ్ర యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే దావోస్‌లో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో జరిగిన సమావేశం తర్వాత ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. గ్రీన్‌ల్యాండ్ భవిష్యత్తుపై నాటోతో ప్రాథమిక ఒప్పందం కుదిరిందని.. ఫిబ్రవరి 1 నుంచి విధించాలనుకున్న టారిఫ్‌లను రద్దు చేస్తున్నానని ట్రంప్ ప్రకటించిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అలాగే గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి సైనిక శక్తిని వాడబోనని స్పష్టం చేయడంతో ఇన్వెస్టర్లలో భయాందోళనలు తొలగిపోయాయి.
వెండి ఈటీఎఫ్‌ల పతనం..
ట్రంప్ కామెంట్స్ తర్వాత సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా భావించే వెండిపై ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఆసక్తి తగ్గించడంతో సిల్వర్ ఈటీఎఫ్‌లు భారీగా క్షీణించాయి.
* టాటా సిల్వర్ ఈటీఎఫ్ అత్యధికంగా 21 శాతం మేర పడిపోయి రూ. 26.41 వద్ద ట్రేడ్ అయింది.
* గ్రో, 360 వన్, యాక్సిస్ సిల్వర్ ఈటీఎఫ్‌లు సుమారు 16 శాతం నష్టపోయాయి.
* కోటక్, మిరే అసెట్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ వంటి ప్రముఖ సంస్థల సిల్వర్ ఈటీఎఫ్‌లు కూడా 15 శాతం మేర క్షీణించాయి.
గోల్డ్ ఈటీఎఫ్‌లపై ప్రభావం..
బంగారం ధరలు కూడా రికార్డు స్థాయిల నుంచి కిందకు దిగిరావడంతో గోల్డ్ ఈటీఎఫ్‌లు డీలా పడ్డాయి. దీంతో మార్కెట్లో ట్రేడ్ అవుతున్న వివిధ ఈటీఎఫ్స్ రేట్లు గురువారం తగ్గాయి.
* బిర్లా సన్ లైఫ్ గోల్డ్ ఈటీఎఫ్ 12 శాతం తగ్గి రూ. 130.42 వద్ద నిలిచింది.
* యాక్సిస్, టాటా, బంధన్ గోల్డ్ ఈటీఎఫ్‌లు 11 శాతం మేర పతనమయ్యాయి.
* హెచ్‌డీఎఫ్‌సీ, నిప్పాన్ ఇండియా, ఎల్‌ఐసీ ఎంఎఫ్ గోల్డ్ ఈటీఎఫ్‌లు 9 శాతానికి పైగా నష్టపోయాయి.
గత సెషన్లలో లైఫ్ టైమ్ హై రికార్డులను సృష్టించిన ఈటీఎఫ్‌లు, తాజా భౌగోళిక రాజకీయ మార్పుల కారణంగా ఒక్కరోజే భారీగా పడిపోవడం ఇన్వెస్టర్లను షాక్‌కు గురిచేసింది. మార్కెట్లో రిస్క్-ఆఫ్ సెంటిమెంట్ తగ్గడంతో, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను విలువైన లోహాల నుంచి ఇతర ఆస్తుల వైపు మళ్లించే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో బులియన్ మార్కెట్లో ప్రాఫిట్ బుక్కింగ్ ఊపందుకుందని నిపుణులు చెబుతున్నారు. ఫిజికల్ గోల్డ్ అండ్ సిల్వర్ కొనకుండా డిజిటల్ రూపంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారి కోసమే ఈటీఎఫ్స్ రూపొందించబడ్డాయి. ఇది పెట్టుబడిదారుల సెంటిమెంట్లను ప్రతిబింబిస్తుంది. అయితే ఇక్కడ రేట్ల పతనం రిటైల్ మార్కెట్లో ధరలను నేరుగా ప్రభావితం చేయనప్పటికీ రేట్ల తగ్గుదలను స్పష్టమైన సంకేతాలను ఇది ఇస్తుంటుంది. అంటే తర్వాతి రోజుల్లో లోహాల రేట్లపై పతనం ప్రభావం కనిపించొచ్చని నిపుణులు చెబుతున్నారు.
