- బోథ్ మీదుగా మొదలెట్టి రెండు నెలలుగా నడక
- రాష్ట్రంలోని 19 జిల్లాల్లో పులుల సంచారం
- ఆవాసం, తోడు కోసం వెతుకుతూ ముందుకు
- హైదరాబాద్ నగరానికి 60 కి.మీ. దూరంలో బెబ్బులి
హైదరాబాద్, వెలుగు : ఓ పులి రాష్ట్రంలో అలుపెరగని ప్రయాణం చేస్తోంది. ఆవాసం కోసమో..? లేక తోడు కోసమో తెలియదు కానీ మహారాష్ట్ర సరిహద్దును దాటి రాష్ట్రంలోకి ప్రవేశించింది. దారి పొడవునా అడవులు, వాగులు, వంకలు, జనారణ్యాలను దాటుకుంటూ దాదాపు 375 కిలోమీటర్లు నడిచి.. ప్రస్తుతం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సమీపానికి చేరుకుంది. రాష్ట్రంలోని 19 జిల్లాల్లో పులులు సంచారం ఉన్నట్లు పాదముద్రల ద్వారా అటవీ అధికారులు తేల్చారు. కాగా, వీటిలో ఒక టైగర్మాత్రం రెండు నెలలుగా సుదీర్ఘ ప్రయాణం కొనసాగిస్తోంది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి బయలుదేరిన ఈ మగ పులి రాష్ట్రంలో విస్తృతంగా సంచరిస్తోంది. ప్రస్తుతం ఇది యాదాద్రి భువనగిరి జిల్లాలో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు కేవలం 60 కిలోమీటర్ల దూరంలో యాదగిరిగుట్ట టెంపుల్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో పెద్దపులి ఆనవాళ్లు కనిపించడంతో ఫారెస్ట్ఆఫీసర్లు అప్రమత్తమయ్యారు. పులి ఇక్కడ ప్రత్యక్షమవడం గడిచిన 50 ఏండ్లలో ఇదే తొలిసారని చెబుతున్నారు.
టెరిటరీ కోసమా..? తోడు కోసమా..?
మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ పులులకు ప్రసిద్ధి. అక్కడి నుంచి ఒక మగ పులి సరిహద్దులోని పెన్‌గంగా నదిని దాటి సుమారు రెండు నెలల కింద ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోకి ప్రవేశించింది. బోథ్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల మీదుగా ఇప్పుడు యాదాద్రి జిల్లాకు చేరింది. మధ్యలో కామారెడ్డి, సిద్దిపేట దాటాక పులి వెనక్కి వెళ్లిపోయిందని అందరూ భావించారు. కానీ అది అనూహ్యంగా రూట్ మార్చుకుని దట్టమైన అటవీ ప్రాంతాల గుండా యాదాద్రి జిల్లా దత్తాయిపల్లి అటవీ ప్రాంతంలోకి అడుగుపెట్టింది. సాధారణంగా కొత్త ప్రాంతాన్ని వెతుక్కుంటూ వెళ్లే మగ పులులు రోజుకు సగటున 18 నుంచి 20 కిలోమీటర్లు నడుస్తాయి.
ఈ క్రమంలోనే ఈ పులి గడిచిన 60 రోజుల్లో సుమారు 375 కిలోమీటర్లు ప్రయాణించినట్లు తెలుస్తోంది. పగలు దట్టమైన పచ్చిక బయళ్లు, పొదల్లో విశ్రాంతి తీసుకుంటూ రాత్రి వేళల్లోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తోందని ఫారెస్ట్ ఆఫీసర్లు పేర్కొంటున్నారు. టెరిటరీ, లేదా ఆడ తోడు కోసం పులి సుదీర్ఘ ప్రయాణం చేస్తోందని వన్యప్రాణి నిపుణులు చెబుతున్నారు. పులి వారానికి ఒక పెద్ద జంతువును వేటాడుతుందని, ఈ లెక్కన రెండు నెలల ప్రయాణంలో కనీసం 5 నుంచి 10 పశువులను, అడవి పందులను వేటాడి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇటీవల ఈ పులి ప్రయాణించిన దారిలో పశువులపై దాడులు జరిగిన ఆనవాళ్లు ఉన్నాయి.
కాగా, ఒకరిద్దరు పులిని ప్రత్యక్షంగా చూశామని చెబుతున్నా.. కెమెరా ట్రాప్‌లకు ఇంతవరకూ చిక్కలేదు. అధికారులు ఎన్ని ట్రాప్ కెమెరాలు పెట్టినా, బోనులు ఏర్పాటు చేసినా చిక్కకుండా తప్పించుకుని తిరుగుతోంది. కేవలం పాదముద్రలు, విసర్జితాల ద్వారానే దాని ఉనికిని గుర్తిస్తున్నారు.
హైదరాబాద్ సమీపంలో పులి సంచారం
యాదాద్రి జిల్లా దత్తాయిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో మూడు రోజుల కింద పులి పాదముద్రలు కనిపించాయి. మంగళవారం కూడా పాదముద్రలు కనిపించడంతో పులి ఇంకా అక్కడే ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ ప్రాంతం యాదగిరిగుట్ట ఆలయానికి ఐదు కిలోమీటర్లు, హైదరాబాద్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉండడం గమనార్హం. గతంలో ఎప్పుడూ హైదరాబాద్‌కు ఇంత సమీపంలోకి పులి రాలేదు. దీంతో దత్తాయిపల్లి, గంధమల్ల, కోనాపూర్, వీరారెడ్డిపల్లి, ఇబ్రహీంపూర్, వెంకటాపూర్, శ్రీనివాసపూర్ గ్రామాల ప్రజలను ఫారెస్ట్ఆఫీసర్లు అప్రమత్తం చేశారు. రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దని హెచ్చరించారు. పులి జాడ తెలిసే వరకు సమీప గ్రామాల ప్రజలు రాత్రి వేళల్లో బయట తిరగరాదని, పశువులను అడవికి దగ్గరగా కట్టేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ట్రాప్ కెమెరాల ద్వారా నిఘా ఉంచామని త్వరలోనే దాని జాడ కనిపెడ్తామని చెబుతున్నారు.
రాష్ట్రంలో పులుల సందడి
రాష్ట్రంలో పులుల సంచారం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం కవ్వాల్ టైగర్ రిజర్వ్‌తో పాటు పలు జిల్లాల్లో 6 నుంచి 8 పులులు, అమ్రాబాద్‌లో 37 వరకు పులులు ఉన్నాయి. ఇవి కాకుండా తాడోబా, తిప్పేశ్వర్, నల్లమల నుంచి రాకపోకలు సాగిస్తున్న పులులు కొత్త జిల్లాలను టచ్ చేస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఒక పులి 8 నెలలుగా అక్కడే సెటిల్ అయింది.
అదే జిల్లాలో మరో పులి ఆరు నెలలుగా మకాం వేసింది. ఏటూరునాగారంలో ఒక పులి ఐదు నెలలుగా, మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో మరో పులి ఆరు నెలలుగా తిష్టవేశాయి. కాగా, పులుల కదలికలపై పీసీసీఎఫ్ నుంచి సెక్షన్ ఆఫీసర్వరకు పర్యవేక్షిస్తున్నారు. పులులు ఎటు నుంచి ఎటు వెళ్తున్నాయి. ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయన్న వివరాలు ఎప్పటికప్పడు సేకరిస్తున్నారు. పులుల సంచారం ఉన్న జిల్లాల్లో డీఎఫ్‌వోల ఆధ్వర్యంలో నిఘా పెట్టారు. ఇందుకోసం డివిజన్‌కు 10 నుంచి 15 వరకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
