మొన్నటి వరకు ఓటర్ లిస్టు సవరణ (SIR), ఆ తర్వాత సీబీఐ వివాదంతో బెంగాల్ భగ్గుమంటూ వస్తోంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి, తృణమూల్ పార్టీకి మధ్య ఎప్పుడూ ఏదో ఒక రాద్దాంతం కొనసాగుతూనే ఉంది. లేటెస్టుగా నాన్ వెజ్ అంశం మరోసారి కొత్త కాంట్రవర్సీని క్రియేట్ చేస్తోంది. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మంకా ప్రారంభించిన వందే భారత్ ట్రైన్ లో ప్యాసెంజర్లకు ఇచ్చే ఆహార మెనూ ఇప్పుడు రెండు పార్టీల మధ్య మరో యుద్ధానికి కారణమవుతోంది.
హౌరా-కామాఖ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో నాన్ వెజ్ ఆప్షన్ లేకపోవడం వివాదానికి దారితీసింది. కేంద్రం నిర్ణయంపై తృణమూల్ విమర్శలకు దిగింది. మొదట మన ఓట్లను తొలగించారు.. ఈ సారి మన ప్లేట్లలో ఉన్న ఆహారాన్ని కూడా తొలగించాలని చూస్తున్నారు.
గత కొన్ని రోజుల క్రితం బెంగాల్ కు వందే భారత్ ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర ప్రకటించారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం బెంగాల్ కు కావాల్సిన అన్ని అభివృద్ధి పనులకు సంబంధించి సహకరిస్తామని స్పష్టం చేసింది. దీనిపై కౌంటర్ ఇస్తూ.. ఈ వందే భారత్ ట్రైన్ లో నాన్ వెజ్ లేకుండా చేశారు. ఇదేనా ఇటీవల మీరు ప్రకటించినది అంటూ తృణమూల్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
బెంగాల్ నుంచి అస్సాం వరకు.. రెండు ప్రాంతాలను కలిపే ట్రైన్ లో ప్రయాణికులు.. తమకు నచ్చిన వెజ్, నాన్ వెజ్ వంటకాలను ఆస్వాదిస్తుంటారు. కానీ చేపలు, మాంసాన్ని మెనూ నుంచి తీసేయటం దారుణం అని మండిపడుతున్నారు. చేపలు తినే బెంగాలీలను మొఘల్స్ అంటూ మోదీ ఎగతాళి చేశారు. ఢిల్లీలో డిక్టేటర్స్ ఫిష్ బ్యాన్ చేస్తున్నారు. చికెన్ పత్తీస్ అమ్ముకునే చిన్న వీధి వ్యాపారులపై దాడులు చేశారు. ఇవాళ తినే ఆహారం, రేపు వేసుకునే బట్టలు, ఆ తర్వాత మన ఇష్టాలు.. ఆ తర్వాత ఎలా బతకాలో కూడా తాము చెప్పినట్లే ఉండాలనే నిబంధనలు పెట్టడం ఖాయం. ఇదేనా ప్రధాని మోదీ ఇస్తున్న సందేశం అంటూ విమర్శనాస్త్రాలు సంధించింది తృణమూల్ పార్టీ.
►ALSO READ | రీల్స్ దబాంగ్ అమ్మాయి.. క్రైం హిస్టరీ చూస్తే మైండ్ బ్లాంక్.. ఇప్పుడు జైల్లో ఎందుకుంది..?
తృణమూల్ విమర్శలపై రైల్వే శాఖ స్పందించింది. రెండు ప్రముఖమైన దేవాలయాలు ఉన్న రూట్లలో మాంసాహారాన్ని అందించలేమని పేర్కొంది. మా కామాఖ్య దేవాలయం, మా కాళీ దేవాలయం మధ్య తిరిగే ట్రైన్ లో నాన్ వెజ్ అందించలేమని.. ఆరోగ్యవంతమైన, హైజీనిక్ వెజిటేరియన్ ఫుడ్ ను మాత్రమే అందిస్తామని పేర్కొంది.
అయితే రైల్వే శాఖ ప్రకటనపై తృణమూల్ కాంగ్రెస్ విరుచుకుపడింది. కాళీ మాత, కామాఖ్య దేవీలకు జంతు బలులు ఇవ్వటం సహజమని.. అలాంటి దేవతల పేర్లతో మాంసాహారాన్ని నిషేధించడమేంటని ఆ పార్టీ ప్రశ్నించింది.
