సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లే వారికి అలర్ట్.. పార్కింగ్ ప్లేస్లు మారాయి గమనించండి

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లే వారికి అలర్ట్.. పార్కింగ్ ప్లేస్లు మారాయి గమనించండి

సికింద్రాబాద్ కు వెహికిల్స్ పైన వెళ్తున్న వారికి దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ స్టేషన్ అధికారులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ లో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నందున ప్రయాణీకులకు పార్కింగ్ స్థలాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. సౌకర్యాలు మెరుగుపరచడం, స్టేషన్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా దాదాపు రూ.714.73 కోట్ల వ్యయంతో స్టేషన్ అభివృద్ధి పనులు చేస్తున్నారు. 

పునరాభివృద్ధిలో భాగంగా, స్టేషన్ ప్రాంగణంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, వాహనాల రాకపోకలను సజావుగా సాగించడానికి చర్యలు తీసుకుంటున్నారు.  ప్లాట్‌ఫారమ్ నంబర్ 1 వద్ద పార్కింగ్ సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. కేవలం పికప్ , డ్రాప్ లను మాత్రమే అనుమతిస్తామని తెలిపారు అధికారులు.

ప్లాట్‌ఫారమ్ నంబర్ 10 వైపు, అనధికార పార్కింగ్, వాహనాల అడ్డంకులను నివారించడానికి యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్ అమలు చేయబడింది. ఈ జోన్‌లోకి ప్రవేశించే ప్రయాణీకులకు 15 నిమిషాల వరకు ఉచిత పికప్,  డ్రాప్ సౌకర్యం ఉంటుంది. ఆ తర్వాత పార్కింగ్ స్థలంలో పార్క్ చేయని వాహనాలపై అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు.

 రైళ్లు ఎక్కడానికి, ప్రయాణికుల రాకపోకలకోసం, పార్కింగ్ ప్రయోజనాల కోసం ప్లాట్‌ఫామ్ నెం. 10 వైపున ఉన్న బేస్‌మెంట్‌లో వాహనాలకు తగినంత పార్కింగ్ సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు.  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నం.10 బేస్‌మెంట్ లో ఉన్న అనుమతించబడిన పార్కింగ్ స్థలాల కోసం ఆమోదించబడిన పార్కింగ్ చార్జీలు  కింది విధంగా ఉన్నాయి. 

పార్కింగ్ ఛార్జీలు:

నాలుగు చక్రాల వాహనాలు (ఫోర్ వీలర్ వెహికిల్స్) మొదటి రెండు గంటల లోపు ఉంటే రూ. 40/. ఆ తర్వాత మరో గంట లేదా అంతకంటే తక్కువ సమయం ఉన్నా అదనంగా  రూ. 20/-.
మోటార్ సైకిల్/స్కూటర్/ ద్విచక్ర వాహనం మొదటి రెండు గంటలు లేదా అంతకు లోపల ఉంటే రూ. 25. ఆ తర్వాత మరో గంట ఉంటే రూ. 10 అదనంగా వసూలు చేస్తారు. బై- సైకిల్ కు మొదటి రెండు గంటలకు రూ. 5 ఉండగా మరో గంట ఎక్కువ అయితే అదనంగా రూ. 2 వసూలు చేస్తారు. 

50 శాతం పనులు పూర్తి:

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రెనొవేషన్ పనులు దాదాపు 50 శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టును డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రయాణికులకు ప్రపంచస్థాయి  సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

►ALSO READ | ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు: ఫామ్‎హౌస్‎లో కేసీఆర్‎తో కేటీఆర్, హరీష్ రావు భేటీ

ఈ సౌకర్యాలలో  ప్లాట్‌ఫామ్ నంబర్ 1 వైపు మల్టీలెవెల్ కార్ పార్కింగ్ సౌకర్యం, ప్లాట్‌ఫామ్ నంబర్ 10 వైపు బేస్‌మెంట్ పార్కింగ్, పార్కింగ్ సామర్థ్యాన్ని పెంచడం, వాహనాల కదలికను క్రమబద్ధీకరించడం, స్టేషన్‌లో ప్రయాణీకులకు, సందర్శకులకు మెరుగైన సౌకర్యాన్ని ఏర్పాటుచేయడం వంటివి ఉంటాయి.
 
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధి పనుల దృష్ట్యా,  స్టేషన్ వద్ద ఎటువంటి ఇబ్బంది లేని ట్రాఫిక్ మూమెంట్ కోసం అనధికార పార్కింగ్ వలన విధించే  ఓవర్- స్టే ఛార్జీలను నివారించడానికి ప్లాట్‌ఫామ్ నంబర్ 10 వైపు ఏర్పాటుచేసిన బేస్‌మెంట్ పార్కింగ్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని రైలు వినియోగదారులకు  దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.