టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20 క్రికెట్ లో తన విధ్వంసం కొనసాగిస్తున్నాడు. ప్రత్యర్థి, వేదిక, బౌలర్ తో సంబంధం లేకుండా తన బ్యాటింగ్ తో బౌలర్లకు చెమటలు పట్టిస్తున్నాడు. వరల్డ్ క్రికెట్ లో నెంబర్ వన్ బ్యాటర్ గా కొనసాగుతున్న అభిషేక్ అంచనాలకు తగ్గట్టుగా ఆడుతున్నాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టీ20లో విధ్వంసం సృష్టించాడు. నాగ్ పూర్ వేదికగా బుధవారం (జనవరి 21) విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో కేవలం 35 బంతుల్లోనే 84 పరుగులు చేసి కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ టీమిండియా ఓపెనర్ ఇన్నింగ్స్ లో 5 ఫోర్లతో పాటు 8 సిక్సర్లున్నాయి.
తొలి టీ20లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న తర్వాత అభిషేక్ శర్మ టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత అభిషేక్ మాట్లాడుతూ ఇలా అన్నాడు.." రోహిత్ భాయ్ దేశం కోసం చాలా చేశాడు. అతను ఇచ్చిన ఆరంభాల తరహాలోనే నేను ఆడాలనుకుంటున్నాను. నేను గ్రౌండ్ లోకి అడుగుపెట్టినప్పుడు మా కెప్టెన్, కోచ్ నా నుండి మెరుపు ఆరంభం కోరుకుంటున్నారు. నేను కూడా రోహిత్ దారిలో వెళ్తున్నాను". అని స్టార్ స్పోర్ట్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిషేక్ స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మను కొనియాడాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. నాగ్ పూర్ వేదికగా బుధవారం (జనవరి 21) విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో 48 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. మొదట బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ చెలరేగితే.. ఆ తర్వాత బౌలర్లు రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసి ఓడిపోయింది. అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
అభిషేక్ శర్మ వరల్డ్ రికార్డ్:
ఈ మ్యాచ్ లో 82 పరుగుల వద్ద అభిషేక్ టీ20 క్రికెట్ లో 5000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. తద్వారా టీ20 ఫార్మాట్ లో అత్యంత వేగంగా 5000 పరుగుల మార్క్ అందుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అభిషేక్ 2898 బంతుల్లో 5000 పరుగుల మార్కును చేరుకున్నాడు. 2942 బంతుల్లో 5000 పరుగుల మార్క్ అందుకున్న విండీస్ ఆటగాడు ఆండ్రీ రస్సెల్ పేరిట ఉన్న మునుపటి రికార్డును అభిషేక్ బద్దలు కొట్టాడు. టిమ్ డేవిడ్ (3127), విల్ జాక్స్ (3196), గ్లెన్ మాక్స్వెల్ (3239) వరుసగా మూడు, నాలుగు. ఐదు స్థానాల్లో ఉన్నారు.
