వంతారా జూ గురించి వినే ఉంటారు. ప్రపంచంలోనే అతి పెద్ద కృత్రిమంగా అభివృద్ధి చేసిన జంతు ప్రదర్శన శాల. అంత పెద్ద జూ ని ఒక చిన్న వాచ్ లో పెట్టేస్తే ఎలా ఉంటుంది..? అదే చేసింది లక్జరీ బ్రాండెడ్ వాచ్ కంపెనీ జాకోబ్ అండ్ కంపెనీ. అనంత్ అంబానీ సృష్టించిన వంతారా జూపార్క్ ను ప్రేరణగా తీసుకుని.. అదే థీమ్ తో ఒపెరా వంతారా గ్రీన్ క్యామో అనే వాచ్ ను 2025 జనవరి 21న విడుదల చేసింది.
ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీకి లగ్జరీ వాచ్ లు అంటే మోజు. ఇప్పటికే ఎన్నోసార్లు వార్తల్లో నిలిచాడు. కేవలం బ్రాండెడ్ వాచ్, యాక్సెసరీస్ తోనే కాకుండా.. వెడ్డింగ్ సందర్భంగా ఖరీదైన గిఫ్టులు అతిథులకు ఇచ్చి వార్తల్లో నిలిచాడు. లేటెస్టుగా అత్యంత ఖరీదైన వాచ్.. అందులో తన డ్రీమ్ ప్రాజెక్ట్ వంతారా జూ పార్క్ థీమ్ లో వాచ్ ధరిస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అమెరికా బ్రాండెడ్ వాచ్ కంపెనీ.. గుజరాత్ జామ్ నగర్ లో ఉన్న వంతారా థీమ్ తో అనంత్ అంబానీకి స్పెషల్ వాచ్ ను తయారు చేసింది.
పన్నెండున్నర కోట్లా..?
వాచేంటి.. పన్నెండున్న కోట్లేంటి..? ఈ ప్రశ్న చూసినవాళ్లందరికీ రావటం కామన్. ఇది కేవలం సింపుల్ వాచ్ మాత్రమే కాదు.. అందులో అనంత్ అంబానీ ఆశయం ఉంది. జంతువులు, విలువైన రత్నాలు, అదే విధంగా అనంత్ చిత్రంతో కూడిన ఈ వాచ్ ఇప్పుడు ప్రపంచంలోనే స్పెషల్ వాచ్ గా నిలుస్తోంది.
డయల్ స్టాండ్ దగ్గర.. న్యాచురల్ గా డ్రా చేసిన అనంత్ అంబానీ బొమ్మ, అది కూడా జంతు సంరక్షణ కోసం అనంత్ కృషి కనిపించేలా రూపొందించారు. అదే విధంగా అతనికి ఇరువైపులా భారత వణ్యాప్రాణుల చిహ్నాల వారసత్వానికి ప్రతీకలైన సింహం, బెంగాల్ టైగర్ (పులి), ఏనుగుల ఫోటోలను ఉంచారు. వన్యప్రాణుల రక్షణ గురించి చాటి చెప్పేలా థీమ్ ను తయారు చేశారు.
స్వయంగా చేతితో కోట్ల విలువైన వజ్ర వైఢూర్యాలతో వాచ్ ను రూపొందించారు. ఆకుపచ్చ రంగులో మెరిసే గోమేధికాలు, తెల్ల రంగులో ధగధగ లాడే వజ్రాలు ఇతర ఆభరణాలతో తయారు చేసిన వాచ్ అద్భుమైన, ప్రకాశవంతమైన మెరుపుతో ఆకట్టుకుంటాయి. మొత్తం 21.98 క్యారట్ల 397 వజ్రాలను ఉపయోగించి వాచ్ ను వెరీ స్టైలిష్ గా తయారు చేశారు. అయితే కంపెనీ ఇంకా ధర అధికారికంగా ప్రకటించనప్పటికీ.. కొన్ని న్యూస్ రిపోర్ట్స్ ఆధారంగా వాచ్ కాస్ట్ 1.5 మిలియన్ డాలర్లు ఉంటుందని అంటున్నారు. అంటే 12 కోట్ల 50 లక్షల రూపాయలకు పైగా ఈ చేతి గడియారం విలువ ఉంటుందన్నమాట.
కంపెనీ మాటల్లో..
కంపెనీ ఫౌండర్ జాకోబ్ అరబో ఈ వాచ్ గురించి చెబుతూ ఎగ్జైట్ కు గురయ్యారు. నా డ్రీమ్.. ఇప్పటి వరకు ఎవరూ చేయనిది చేయటమే. ఈ బ్రాండ్ ద్వారా.. సాధ్యం కాదు అనే డిజైన్లను.. కొత్త కొత్త థీమ్స్ తో తయారు చేయడమేనని చెప్పుకొచ్చాడు.
అరబో.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెలెబ్రిటీలు, బిజినెస్ పర్సన్స్ కు లగ్జరీ వాచ్ లను తయారు చేస్తుంటారు. సల్మాన్ ఖాన్, క్రిస్టియానో రొనాల్డో, లియెనెల్ మెస్సీ, రిహన,జాయ్-జడ్ లాంటి A-లిస్టర్స్ కు అత్యంత కాస్ట్ లీ వాచ్ లను తయారు చేసిన కంపెనీ.. ఇప్పుడు అనంత్ అంబానీ కోసం వంతారా థీమ్ తో వాచ్ తయారు చేయడం వార్తల్లో నిలిచింది. గతంలో రామ జన్మభూమి థీమ్ తో కూడా వాచ్ తయారు చేయగా అనంత్ అంబానీ, అమితాబ్ బచన్, అభిషేక్ బచ్చన్ లాంటి సెలబ్రిటీలు ధరించి అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచారు.
