గ్రీన్‌లాండ్‌లో ఇల్లు కొనొచ్చు అమ్మెుచ్చు.. కానీ ఆ స్థలానికి మీరు ఓనర్ కాలేరు తెలుసా..?

గ్రీన్‌లాండ్‌లో ఇల్లు కొనొచ్చు అమ్మెుచ్చు.. కానీ ఆ స్థలానికి మీరు ఓనర్ కాలేరు తెలుసా..?

ప్రపంచంలో ఎక్కడైనా ఇల్లు కొంటున్నామంటే.. ఆ ఇల్లు ఉన్న స్థలం కూడా మనదే అవుతుందని భావిస్తాం. కానీ గ్రీన్‌లాండ్‌లో లెక్కలు మెుత్తం డిఫరెంట్. అక్కడ మీరు ఇల్లు కొనుక్కోవచ్చు, దానిని ఇతరులకు అమ్ముకోవచ్చు లేదా తర్వాతి తరాలు అంటే పిల్లలకు వారసత్వంగా ఇవ్వవచ్చు. కానీ.. ఆ ఇల్లు ఏ భూమి మీదైతే ఉందో.. ఆ స్థలం మాత్రం మీది కాదు ఎప్పటికీ. అవును గ్రీన్‌లాండ్ చట్టాల ప్రకారం అక్కడ భూమిపై ఎవరికీ ప్రైవేట్ యాజమాన్య హక్కులు ఇవ్వరు.. జస్ట్ దానిపై నిర్మించిన ప్రాపర్టీకి మాత్రమే మీరు యజమానులుగా ఉండొచ్చన్నమాట.

భూమి అంతా ప్రజలదే.. 
డెన్మార్క్ రాజ్యంలో స్వయంప్రతిపత్తి కలిగిన భూభాగమైన గ్రీన్‌లాండ్‌లో భూమి అంతా పబ్లిక్ ప్రాపర్టీగా పరిగణించబడుతుంది. ఏ వ్యక్తి, కంపెనీ లేదా విదేశీయులు అక్కడ భూమిని సొంతంగా కొనుగోలు చేయలేరు. నివాసితులకు స్థానిక మునిసిపాలిటీలు భూమిని ఉపయోగించుకునే 'దీర్ఘకాలిక వినియోగ హక్కు' మాత్రమే కల్పిస్తాయి. అంటే మీరు అక్కడ ఇల్లు నిర్మించుకుని నివసించవచ్చు.. కానీ ఆ నేల మాత్రం సామాజిక నియంత్రణలోనే ఉంటుంది. ఒకవేళ ఇల్లు కూల్చివేస్తే, ఆ స్థలం ఆటోమేటిక్‌గా తిరిగి ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్తుంది.

శతాబ్దాల సంప్రదాయం.. 
ఈ వింతైన వ్యవస్థ వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. గ్రీన్‌లాండ్‌లో ప్రజలు నివరించటానికి వీలైన భూమి చాలా తక్కువ. విపరీతమైన చలి వాతావరణం కారణంగా ఇక్కడ వనరులను పంచుకోవడం అనే సంప్రదాయం శతాబ్దాలుగా వస్తోంది. భూమిని ఒక వ్యాపార వస్తువులా చూడకూడదనే ఉద్దేశంతోనే ప్రైవేట్ యాజమాన్య హక్కులను ఎప్పుడూ అనుమతించలేదు. దీనివల్ల రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్ ఉండదు. ఇంటి ధరలు కేవలం ఆ నిర్మాణం విలువపైనే ఆధారపడి ఉంటాయి తప్ప.. భూమి ధరల పెరుగుదలతో సంబంధం ఉండదు.

►ALSO READ | ఆస్ట్రేలియాలో కాల్పుల్లో ముగ్గురు మృతి.. హంతకుడి కోసం లేక్ కార్గెల్లిగో పట్టణంలో లాక్ డౌన్

విదేశీయులపై కఠిన ఆంక్షలు.. 
విదేశీయులు గ్రీన్‌లాండ్‌లో ఆస్తులు కొనాలంటే చాలా కఠినమైన రూల్స్ ఉంటాయి. వారు అక్కడ దీర్ఘకాలం నివసించడంతో పాటు ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. విదేశీ శక్తులు లేదా ధనవంతులు ఇక్కడి భూములను అడ్డగోలుగా ఆక్రమించకుండా ఉండేందుకే ఈ ఏర్పాటు. అమెరికా అధ్యక్షుడు  ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను కొంటామని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అక్కడి ప్రజలు తమ భూమి వ్యవస్థను మరింత పటిష్టంగా కాపాడుకుంటున్నారు. భూమి కేవలం నివసించడానికి మాత్రమే, అది ఎవరి సొంతం కాకూడదనేది గ్రీన్‌లాండ్ ప్రజల నమ్మకం. అందుకే వారు దానిని అంత సీరియస్ గా ఫాలో అవుతున్నారు.