భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. క్రూడ్ సెగలతో రూ.8 లక్షల కోట్లు ఆవిరి..

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. క్రూడ్ సెగలతో రూ.8 లక్షల కోట్లు ఆవిరి..

సోమవారం భారత స్టాక్ మార్కెట్లు బ్లడ్ బాత్ చూసాయి. ముదురుతున్న చమురు సంక్షోభంతో బ్రెంట్ ఆయిల్ రేటు 120 డాలర్లకు చేరుకున్న వేళ మార్కెట్లు అతలాకుతలం అయ్యాయి. మార్కెట్ల క్లోజింగ్ సమయంలో సెన్సెక్స్ 1352 పాయింట్ల నష్టంతో క్లోజ్ అవ్వగా.. నిఫ్టీ సూచీ 420 పాయింట్లకు పైగా పడిపోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 1763 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1128 పాయింట్లు నష్టపోయింది. 

ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలటంతో క్లోజింగ్ నాటికి ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.8 లక్షల కోట్లు ఆవిరైపోయింది. అయితే ఉదయం భారీగా పెరిగిన క్రూడ్ రేట్లు సాయంత్రం నాటికి 16 డాలర్ల వరకూ తగ్గి 103 డాలర్ల వద్ద బ్యారెల్ అమెరికా క్రూడ్ ఆయిల్ ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో జీ7 దేశాలు తమ వద్ద ఉన్న 400 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ నిల్వలను బయటకు తీసి ధరల పెరుగుదలకు కళ్లెం వేయాలని ప్లాన్ చేస్తున్నాయి. 

మార్కెట్ల ముగింపు నాటికి దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి. ప్రధానంగా ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకింగ్ స్టాక్స్ అన్నింటి కంటే తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఈ క్రమంలో కొన్ని ఐటీ రంగానికి చెందిన షేర్లు మాత్రం లాభపడ్డాయి. అయితే ఫార్మా స్టాక్స్ మాత్రం ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ లాభాలను నమోదు చేశాయి.