ఎల్ఐసీ పెట్టుబడులపై యుద్ధం ప్రభావం.. ఆ 5 స్టాక్స్ వల్ల రూ.47వేల కోట్లు లాస్..!

ఎల్ఐసీ పెట్టుబడులపై యుద్ధం ప్రభావం.. ఆ 5 స్టాక్స్ వల్ల రూ.47వేల కోట్లు లాస్..!

ప్రపంచ మార్కెట్లను ఇరాన్ యుద్ధం కుదిపేస్తున్న వేళ.. భారతీయ ఇన్సూరెన్స్ దిగ్గజం LIC పోర్ట్‌ఫోలియోపై తీవ్ర ప్రభావం పడింది. 2026లో స్టాక్ మార్కెట్లు భారీగా పతనం కావడంతో.. ఎల్ఐసీ అత్యధికంగా పెట్టుబడి పెట్టిన టాప్-5 కంపెనీల విలువలు పతనం కావటంతో ఏకంగా రూ.47వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. రిలయన్స్, ఎస్‌బీఐ, ఐటీసీ, ఇన్ఫోసిస్, ఎల్‌అండ్‌టీ వంటి దిగ్గజ సంస్థల్లో ఎల్ఐసీకి ఉన్న వాటా విలువ గత ఏడాది డిసెంబర్ నాటికి రూ.4.53 లక్షల కోట్లు ఉండగా.. అది ఇప్పుడు రూ.4.06 లక్షల కోట్లకు పడిపోయింది.

అత్యధికంగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ఎల్ఐసీకి ఉన్న పెట్టుబడి విలువ 11 శాతం ఆవిరై సుమారు రూ.16వేల 021 కోట్లకు చేరింది. అయితే ముడిచమురు ధరల పెరుగుదల వల్ల రిలయన్స్ లాభపడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఐటీసీ షేర్లు ఈ ఏడాది ఏకంగా 24 శాతం పతనమయ్యాయి. సిగరెట్లపై ఎక్సైజ్ సుంకం పెరగడం, ముడిసరుకు ధరల ఒత్తిడి కారణంగా ఎల్ఐసీకి ఈ ఒక్క కంపెనీ నుంచే రూ.19వేల 086 కోట్ల నష్టం ఏర్పడింది.

►ALSO READ | క్రూడ్ ఆయిల్ ఒక్క డాలర్ పెరిగితే.. భారత్‌పై రూ.12వేల 600 కోట్లు భారం.. 50 డాలర్లు పెరిగితే పరిస్థితి ఊహించుకోండి..!

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా 19 శాతం క్షీణించడంతో ఎల్ఐసీ వాటా విలువ రూ.14వేల 609 కోట్లు తగ్గింది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ఎల్‌అండ్‌టీ కంపెనీపై కూడా ప్రభావం చూపుతున్నాయి. అక్కడ పనిచేస్తున్న వేలాది మంది కార్మికుల భద్రత, ఆర్డర్ల రాకలో జాప్యం వంటి కారణాలతో ఈ కంపెనీలో ఎల్ఐసీ పెట్టుబడుల విలువ రూ.5వేల 132 కోట్లు క్షీణించింది.

ఈ భారీ పతనంలోనూ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ మాత్రం ఎల్ఐసీకి కొండంత అండగా నిలిచింది. మిగిలిన షేర్లు పడిపోతున్నా.. ఎస్‌బీఐ మాత్రం ఈ ఏడాది ఇప్పటివరకు 10 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీనివల్ల ఎల్ఐసీ పోర్ట్‌ఫోలియోకు రూ.8వేల కోట్లు పెట్టుబడుల విలువ పెరిగింది. మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ.. ఎల్ఐసీ దీర్ఘకాలిక పెట్టుబడిదారుగా కొనసాగుతుండటం గమనార్హం. యుద్ధ పరిస్థితులు సద్దుమణిగితే తప్ప ఈ దిగ్గజ కంపెనీల షేర్లు తిరిగి పుంజుకునే అవకాశం కనపడటం లేదంటున్నారు మార్కెట్ నిపుణులు.