ఆస్ట్రేలియాలో కాల్పుల్లో ముగ్గురు మృతి.. హంతకుడి కోసం లేక్ కార్గెల్లిగో పట్టణంలో లాక్ డౌన్

ఆస్ట్రేలియాలో కాల్పుల్లో ముగ్గురు మృతి.. హంతకుడి కోసం లేక్ కార్గెల్లిగో పట్టణంలో లాక్ డౌన్

ఆస్ట్రేలియా దేశం మళ్లీ వణికిపోయింది. ఓ దుండగుడు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. 2026, జనవరి 22వ తేదీన.. లేక్ కార్గెల్లిగో పట్టణంలో ఈ ఘటన జరిగింది. తుపాకీ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. కాల్పుల తర్వాత దుండగుడు స్పాట్ నుంచి పారిపోయాడు. అప్రమత్తం అయిన పోలీసులు.. లేక్ కార్గెల్లిగో టౌన్ కు చేరుకున్నారు. హంతకుడిని పట్టుకోవటానికి లాక్ డౌన్ ప్రకటించారు. రోడ్లపై ఉన్న జనం అంతా ఇళ్లల్లోకి వెళ్లిపోవాలని.. బయట ఎవరూ ఉండొద్దని మైకుల్లో అనౌన్స్ చేశారు. ఈ పట్టణంలో 15 వందల మంది జనాభా ఉన్నారు.

2025, డిసెంబర్ నెలలో హనుక్కా ఏరియాలో ఇద్దరు ఆగంతకుల కాల్పుల్లో 15 మంది చనిపోయిన ఘటన మర్చిపోక ముందే.. మళ్లీ కాల్పుల ఇన్సిడెంట్ జరగటంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. 

ఇప్పుడు కాల్పులు జరిగిన వ్యక్తి దగ్గర పొడవాటి తుపాకీ ఉందని.. అతను రోడ్డుపైకి వచ్చి ఇష్టానుసారం కాల్పులు జరిపాడని చెబుతున్నారు లేక్ కార్గెల్లిగో పట్టణ ప్రజలు. కాల్పుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు చనిపోయాడు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్యం విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. 

లేక్ కార్గెల్లిగో పట్టణంలో కాల్పుల విషయం తెలిసిన వెంటనే.. న్యూ సౌత్ వేల్స్ నుంచి పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు స్పాట్ కు చేరుకున్నాయి. కాల్పుల జరిపిన వ్యక్తిని పట్టుకునేందుకు పట్టణంలో లాక్ డౌన్ విధించారు. షాపులు మూసివేయించారు., జనం అంతా ఇళ్లల్లోనే ఉండాలని.. హోటల్స్ మూసివేయాలని ఆదేశించారు. హంతకుడిని పట్టుకునే వరకు ఎవరూ బయటకు రావొద్దని ఆదేశించారు పోలీసులు. 

ఆస్ట్రేలియా దేశం టైమింగ్స్ లో సాయంత్రం 4 గంటల 40 నిమిషాలకు పోలీసులకు ఫోన్ వచ్చింది. లేక్ కార్గెల్లిగో పట్టణంలోని యెల్కిన్ స్ట్రీట్ సమీపంలోని వాకర్ స్ట్రీట్ సమీపంలో ఈ కాల్పులు జరిగాయని ప్రకటించారు పోలీసులు. 

కాల్పులు జరిపిన వ్యక్తి తీవ్రవాదినా లేక కుటుంబ కలహాలతో ఇలా చేశాడా అనేది ఇంకా నిర్థారించలేదు ఆస్ట్రేలియా ప్రభుత్వం.