క్రూడ్ ఆయిల్ ఒక్క డాలర్ పెరిగితే.. భారత్‌పై రూ.12వేల 600 కోట్లు భారం.. 50 డాలర్లు పెరిగితే పరిస్థితి ఊహించుకోండి..!

క్రూడ్ ఆయిల్ ఒక్క డాలర్ పెరిగితే.. భారత్‌పై రూ.12వేల 600 కోట్లు భారం.. 50 డాలర్లు పెరిగితే పరిస్థితి ఊహించుకోండి..!

ఇరాన్ పై యుద్ధం ఒక వారంలో అయిపోతుందిలే.. ఆ తర్వాత అంతా మెల్లగా సెట్ అయిపోతాయని అందరూ భావించారు. కానీ ప్రస్తుతం రెండోవారంలోకి వార్ ఎంటర్ కావటంతో ఆ ఆశలు సన్నగిల్లుతున్నాయి. దీంతో గల్ఫ్ దేశాల నుంచి క్రూడ్, గ్యాస్ దిగుమతులు దాదాపుగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలతో చమురు దిగుమతులపై ఆధారపడిన చాలా దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. 

సోమవారం ఒక్కసారిగా బ్యారెల్ క్రూడ్ ధర 120 డాలర్లకు చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. గతవారం యుద్ధం స్టార్ట్ అయ్యాక 90 డాలర్ల కంటే కొద్దిగా దిగువన ఉన్న క్రూడ్ రేట్లు అమాంతం పెరిగిపోవటంతో చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ప్రస్తుతం పెరిగిన క్రూడ్ రేట్ల ప్రకారం భారతదేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు లీటరుకు రూ.15 నుంచి రూ.30 మధ్య పెంచాల్సి ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఆ భారాన్ని ప్రభుత్వ ఆయిల్ కంపెనీలను భరించాలని.. ప్రజలపై భారం మోపొద్దని నిర్ణయించింది. 

అయితే వాస్తవానికి అసలు క్రూడ్ ఆయిల్ రేటు బ్యారెల్ కి ఒక డాలర్ పెరిగితే భారతదేశంపై ఎంత అదనపు భారం పడుతుందనే అంశంపై మాజీ నీతి ఆయోగ్ చీఫ్ అమితాబ్ కాంత్ చెప్పిన లెక్కలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ కి ఒక డాలర్ అంటే రూ.90 పెరిగితే అది భారతదేశపు దిగుమతి బిల్లును 1.4 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీ లెక్కల్లో రూ.12వేల 600 కోట్లు ఆర్థిక భారాన్ని కలిగిస్తుందని ఆయన వెల్లడించారు. 

ALSO READ : గల్ప్ దేశాల్లో కోటి మంది భారతీయులు..

కేవలం కొద్ది రోజుల్లోనే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ రేటు దాదాపు 30 డాలర్ల వరకూ పెరిగిన వేళ దీనివల్ల ఇండియాపై 42 బిలియన్ డాలర్లు అదనపు దిగుమతుల భారం పడుతుందట. భారత కరెన్సీ లెక్కల ప్రకారం రూ.3లక్షల 80వేల కోట్ల మేర ఇంపోర్ట్ బిల్స్ పెరుగుతాయని చెప్పారు అమితాబ్ కాంత్. వాస్తవానికి 2026లో సగటున బ్యారెల్ క్రూడ్ ఆయిల్ రేటు 63 డాలర్లుగా ఉంటుందని నిపుణులు అంచనా వేసినప్పటికీ ప్రస్తుత యుద్ధ పరిస్థితులతో ఇది కాస్త డబుల్ అయిపోయింది. హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు సాధారణ స్థితికి చేరుకునే వరకూ క్రూడ్ ఆయిల్ సెగలు ప్రపంచ దేశాలను మరీ ముఖ్యంగా ఇండియాను ఇబ్బందులకు గురిచేస్తాయని నిపుణులు అంటున్నారు.