లెక్క ఇదీ : గల్ప్ దేశాల్లో కోటి మంది భారతీయులు.. ఇరాన్ లో 9 వేల మంది

లెక్క ఇదీ : గల్ప్ దేశాల్లో కోటి మంది భారతీయులు.. ఇరాన్ లో 9 వేల మంది

ఇరాన్ దేశంలో ఇప్పటికీ ఎంత మంది భారతీయులు ఉన్నారు.. యుద్ధం ప్రభావం ఉన్న గల్ఫ్ దేశాల్లో ఎంత మంది ఇండియన్స్ ఉన్నారు అనేదానికి సమాధానం దొరికేసింది. లోక్ సభలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ వివరాలు వెల్లడించారు. 

ఇరాన్ దేశంలో ఇప్పటికీ 9 వేల మంది భారతీయులు ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. యుద్ధం ప్రారంభం కంటే ముందే.. భారతదేశం నుంచి హెచ్చరికలు జారీ చేశామని.. అయినా కొందరు అక్కడ ఉండటానికే ఇష్టపడ్డారని వెల్లడించారాయన. ఈ 9 వేల మందిలో ఎక్కువ మంది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన వారు.. మిగతా వారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్లినట్లు వెల్లడించారాయన. ఇప్పటికీ ఇరాన్ దేశంలో ఉన్న ఈ 9 వేల మంది భారతీయులు.. ఆ దేశ రాజధాని టెహ్రాన్ లో కాకుండా.. సిటీకి 150 కిలోమీటర్ల దూరంలోని కోమ్ నగరంలో ఉన్నారని పార్లమెంట్ లో వెల్లడించారాయన. 

ఇరాన్ లో యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ ఎయిర్ స్పేస్ మూసివేశారని.. ఈ పరిణామాలతో భారతీయులకు పక్కనే ఉన్న ఆర్మేనియా, తుర్కేనిస్తాన్ దేశాలకు తరలించి.. అక్కడి నుంచి ఇండియాకు తీసుకొచ్చే మార్గాలను అన్వేషిస్తు్న్నట్లు వెల్లడించారాయన. ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి జయశంకర్. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో.. పశ్చిమ ఆసియా దేశాల నుంచి 67 వేల మంది భారతీయులు.. ఇండియాకు తిరిగి వచ్చారని వివరించారాయన. 

గల్ఫ్ దేశాల్లోనూ కోటి మంది భారతీయులు ఉన్నారని.. అక్కడ ఉద్యోగ, ఉపాధి పనుల్లో వీళ్లందరూ ఉన్నారని.. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లోని భారతీయులకు ఎలాంటి ముప్పు లేదన్నారాయన. గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు ఉన్నా.. అక్కడ ఉన్న భారతీయులు ప్రస్తుతానికి సురక్షితంగానే ఉన్నారని.. అవసరం అయితే వాళ్లను ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారాయన.