హైదరాబాదీలకు మరో ప్లే పార్కు అందుబాటులోకి వచ్చింది. ఆరోగ్యం, ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్స్, చిల్డ్రన్ ప్లే మొదలైన ఎన్నో సదుపాయాలతో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో జీహెచ్ఎంసీ అభివృద్ధి చేసింది. మొత్తం 3.10 కోట్ల రూపాయల వ్యయంతో చిల్డ్రన్ ప్లే పార్క్ ను గురువారం (జనవరి 22) ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్.
రోడ్ నెంబర్ 44, 45 మధ్యలో ఉపయోగంలో లేని స్థలాన్ని పార్క్‌గా తీర్చిదిద్దింది జీహెచ్ఎంసీ. పార్క్‌లో 10 లక్షల లీటర్ల వర్షపు నీటిని నిల్వ చేసే స్టోరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. వాకింగ్ ట్రాక్, యోగా స్థలం, టెన్నిస్ కోర్టు వంటి ఆధునిక సదుపాయాలు కల్పించారు. పిల్లలు, పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన ప్రాంతాలు కూడా ఉన్నాయి.
పార్క్ వల్ల స్థానిక ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం, వినోదం, వ్యాయామానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి పొన్నం అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి సీఎం సమగ్ర ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. ఇన్క్లూజివ్ గ్రోత్, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందన్నారు. రాబోయే తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పార్క్‌ను అద్భుతంగా అభివృద్ధి చేసిన జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి ప్రశంసించారు.
అనంతరం సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి టెన్నిస్ ఆడారు మంత్రి పొన్నం. పార్క్ ప్రారంభం అనంతరం టెన్నిస్ కోర్టు, యోగా స్థలాలు, వాటర్ స్టోరేజ్ ప్లేస్, గార్డెన్ల పరిశీలించారు. ఉదయం, సాయంత్రం ప్రజలు సేదతీరేందుకు పార్క్ ఎంతో ఉపయోగకరమని ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మీ అన్నారు.
పార్కు ప్రారంభ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, జోనల్ కమిషనర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
