వివాదాల్లో పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ

వివాదాల్లో పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ

ఎల్ బీనగర్, వెలుగు: సిటీ శివారులోని పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ ఏర్పాటు నుంచే వివాదాలకు కేరాఫ్​గా నిలుస్తోంది. పైసలిస్తేనే ఫైల్ కదులుతుందనే స్థాయికి మున్సిపాలిటీలో అవినీతి పెరిగిపోయింది. కమిషనర్లే ఏసీబీకి చిక్కారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. కొందరు కమిషనర్లు పూర్తికాలం పని చేయకుండానే బదిలీ కావడం, మరికొందరు అక్రమాల ఆరోపణలతో లాంగ్​లీవ్​పై వెళ్లడం, ఇంకొందరు లంచం తీసుకుంటూ దొరికిన ఘటనలు మామూలుగా మారాయి. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలంలోని కొన్ని గ్రామాలను కలిపి అంబర్​పేట గ్రామ పంచాయతీని 2013, మార్చి 22 న నగర పంచాయతీగా, అనంతరం 2018 మార్చి 23న మున్సిపాలిటీగా ప్రభుత్వం అప్​గ్రేడ్​చేసింది. నగర పంచాయతీ మొదటి కమిషనర్ నుంచి రెండు రోజుల కిందట సస్పెండైన మున్సిపల్​ కమిషనర్​ ఖమర్ అహ్మద్ ​వరకు వివాదాల్లోనే చిక్కారు. పాత కమిషనర్​ రవీందర్ రావు ఆఫీసులోనే ఓ వ్యక్తి వద్ద రూ.1.5లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్​హ్యాండెడ్​గా దొరికాడు. ఆ తర్వాత వచ్చిన కమిషనర్ ఆరోపణల కారణంగా లాంగ్ లీవ్ లో వెళ్లాడు. మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్ అక్రమ నిర్మాణాలకు ఇంటి నంబర్లు ఇస్తుండగా ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. గతేడాది జూన్​లో ఖమర్ అహ్మద్ ​కమిషనర్​గా వచ్చాడు. ఆయన వివాదంలో ఉన్న ప్లాట్లకు నిర్మాణ పర్మిషన్లు ఇస్తున్నారనే ఆరోపణలపై రెండు రోజుల కిందట సస్పెండ్ ​అయ్యారు.  ప్రస్తుతం ఆదిబట్ల మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డికి ఇన్​చార్జ్ గా అదనపు బాధ్యతలు ఇస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. 

ఔటర్ ​రింగ్​ రోడ్డు సమీపంలో ఉండగా..

 సిటీ శివారు, ఔటర్​ రింగ్​రోడ్డుకు సమీపంలో మున్సిపాలిటీ ఉండడంతో భూముల రేట్లు అధికంగా పెరిగిపోగా కొన్నేండ్లుగా భూ వివాదాలు ఏర్పడ్డాయి. ఇందులో కోర్టులో కేసులు నడుస్తున్నవి కొన్నైతే, డబుల్ రిజిస్టేషన్ల సమస్యలు ఉన్నవి కూడా ఉన్నాయి. దీంతో మున్సిపాలిటీలో పని చేసే అధికారులకు పైసల పంట  పండిస్తుండగా, మరోవైపు పారేషాన్ ​కూడా తెస్తున్నాయి. భూ సమస్యల్లోని ప్లాట్లకు భవన నిర్మాణ పర్మిషన్లు, అడ్డగోలుగా ఇంటి నంబర్లు కేటాయించి అధికారులు వివాదాల్లో చిక్కుతున్నారు. ఏ చిన్న పని కావాలన్నా బిల్ కలెక్టర్ నుంచి  కమిషనర్ వరకు లంచం ఇస్తేనే పనులు త్వరగా అవుతుంటాయని, లేదంటే నెలల కొద్ది ఆఫీస్ చుట్టూ తిరగాల్సిందేనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల ఇబ్బందులను తట్టుకోలేని కొందరు ఏసీబీకి కంప్లయింట్​ చేసి పట్టించే వరకు వెళ్తున్నారు. 

ఏ‌సీబీ దాడులైతున్నయని వాస్తు మార్చినా..

 మున్సిపాలిటీ ఏర్పడిన నాటి నుంచి గ్రామ పంచాయతీ భవనంలోనే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.  భవనానికి ముఖ ద్వారంలోనే రోడ్డు పోటు ఉండడంతో 2020లో వచ్చిన కమిషనర్ ఆఫీస్ కు ఎదురుగా గోడ కట్టించారు. ఇక రోడ్డు పోటు లేదనుకుని అనుకున్న ఆయనపై అవినీతి ఆరోపణలు రాగా తట్టుకోలేక లాంగ్ లీవ్ లో వెళ్లిపోయారు.  ఇది జరిగి ఏడాది కాకముందే కమిషనర్ ఖమర్ అహ్మద్ ​శుక్రవారం సస్పెండ్ అయ్యాడు. నగర పంచాయతీ అయినప్పటి నుంచి ఇద్దరు కమిషనర్లు ఏ‌సీబీకి చిక్కగా ఒక్కరిద్దరు మినహా ఏదో ఒక వివాదంలో మిగతా వారు చిక్కి ట్రాన్స్ ఫర్​అయ్యారు. ఇంకొకరు, ముగ్గురు బిల్ కలెక్టర్లు, మేనేజర్ కూడా ఇదే తరహాలో  సస్పెండ్ అయ్యాడు.