మే 22 తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు

 మే 22 తర్వాత తెలంగాణలో  భారీ వర్షాలు
  • బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే చాన్స్: ఐఎండీ​
  • నేటినుంచి నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వానలు  
  • వచ్చే మూడు రోజులు 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్​ జారీ

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో ఈ నెల 22 తర్వాత అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.  22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే చాన్స్​ ఉందని తెలిపింది.  దాని ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్రతో పాటు తెలంగాణలోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని శనివారం విడుదల చేసిన బులెటిన్​లో పేర్కొన్నది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆవర్తనానికి తోడు.. ఈ నాలుగైదు రోజుల్లో ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

ప్రస్తుతం చత్తీస్​గఢ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఇంటీరియర్​ కర్నాటక వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని, దీని ప్రభావంతో దక్షిణ తెలంగాణతో పాటు ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని పేర్కొన్నది. పలు జిల్లాలకు వచ్చే మూడు రోజులకుగానూ హైదరాబాద్​ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది. ఆదిలాబాద్​, కుమ్రంభీం ఆసిఫాబాద్​, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్​, వరంగల్, హనుమకొండ, జనగామ, రంగారెడ్డి, హైదరాబాద్​, మేడ్చల్​ మల్కాజిగిరి, వికారాబాద్​, సంగారెడ్డి, మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్​, ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈదురుగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొంది. హైదరాబాద్​ సిటీలోనూ వచ్చే మూడు రోజుల పాటు ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. మరో వారం పాటు రాష్ట్రంలో వర్షాలే ఉంటాయని పేర్కొంది. కాగా,  టెంపరేచర్లు తగ్గి వాతావరణం చల్లబడినా.. రాష్ట్రవ్యాప్తంగా ఉక్కపోత మాత్రం తీవ్రంగా ఉంది. అన్ని జిల్లాల్లోనూ సాధారణం కన్నా ఎక్కువగా గాలిలో తేమ శాతం నమోదైంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ 90 నుంచి వంద శాతం మేర తేమ రికార్డయింది.

సిటీలో దంచిన వాన 

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం మోస్తరు వర్షాలు కురిశాయి. హైదరాబాద్​ సిటీతో పాటు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్​కర్నూల్​, మహబూబ్​నగర్, జోగులాంబ గద్వాల, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్​ మల్కాజిగిరి, మెదక్​, సంగారెడ్డి, సిద్దిపేట, మహబూబాబాద్​ జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. అత్యధికంగా హైదరాబాద్​లోని లింగంపల్లిలో 6.9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా కట్టంగూర్​లో 6.6 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా నడిగూడెంలో 6.3 సెంటీ మీటర్ల రెయిన్​ఫాల్​ రికార్డైంది.  జీహెచ్​ఎంసీ పరిధిలోని శేరిలింగంపల్లిలో 6.9 సెంటీమీటర్ల వాన పడగా.. హస్తినాపురంలో 5.6, నాచారంలో 4.8, వనస్థలిపురం 4.7, ఆర్సీపురం 4.7, బీహెచ్ఈఎల్​ 4.5,  నాగోల్​ 4.2, గచ్చిబౌలిలో 3.8, ఉప్పల్​లో 3.7, సైదాబాద్​లో 3.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. వనస్థలిపురం చింతలకుంట వద్ద విజయవాడ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డుకిరువైపులా రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్​ స్తంభించింది. అంబులెన్స్​లు ట్రాఫిక్​లో ఇరుక్కున్నాయి. 3 కార్లు వరద నీటిలో పూర్తిగా మునిగిపోయాయి. సహాయక చర్యల కోసం డీఆర్ఎఫ్ సిబ్బందికి 37 ఫిర్యాదులు అందాయి. 

మేయర్​ టెలీకాన్ఫరెన్స్​

నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జోనల్ కమిషనర్లు, ఎస్ఈలతో జీహెచ్​ఎంసీ మేయర్ గద్వాల్​ విజయలక్ష్మి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వాటర్ లాగింగ్ పాయింట్లు, నాలాలను ఎప్పటికప్పుడు పరిశీలిం చాలని సూచించారు. ప్రజలకు వరదల వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నగరం జలమయం​

జీహెచ్​ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాలు చిన్న వానకే జలమయమయ్యాయి. సిటీలో ఉదయం నుంచే మబ్బు పట్టి ఉండగా.. మధ్యాహ్నం 3 గంట లకు ఒక్కసారిగా క్యుములో నింబస్​ మేఘాలు కమ్మేశాయి. దీని ప్రభావంతో హయత్​నగర్, ఉప్పల్, ఎల్బీనగర్, దిల్​సుఖ్​నగర్​, పటాన్​చెరు, శేరిలింగంపల్లి, సరూర్​నగర్, నాగోల్, మల్కాజిగిరి తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొ ట్టింది. పలు చోట్ల ఇండ్లలోకి వరద నీరు చేరింది.