పొలిటికల్​ భూవివాదంలో మల్లారెడ్డి..అనుచరులతో హంగామా

పొలిటికల్​ భూవివాదంలో మల్లారెడ్డి..అనుచరులతో హంగామా
  • అల్లుడు రాజశేఖర్ రెడ్డితో కలిసి వివాదాస్పద స్థలంలో ఫెన్సింగ్ తొలగింపు
  •  అనుచరులను వెంట తీసుకెళ్లి హంగామా
  • తమ భూమిని కబ్జా చేశారని బాధితుల ఆరోపణ
  •  కోర్టు ఆర్డర్ ఉన్నా మల్లారెడ్డి దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన
  • ఇరు వర్గాలపై కేసు పెట్టిన పోలీసులు   

జీడిమెట్ల, వెలుగు: మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి భూవివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ లోని సుచిత్ర ఏరియాలో రూ.వందల కోట్లు విలువ చేసే 2 .10 ఎకరాల భూమిపై వివాదం నడుస్తుండగా, అది మొత్తం తనదేనంటూ మల్లారెడ్డి శనివారం అక్కడ హంగామా చేశారు. తన అల్లుడు రాజశేఖర్ రెడ్డి, అనుచరులతో కలిసి వెళ్లి వివాదాస్పద స్థలంలో ఉన్న ఫెన్సింగ్‌‌ ను తొలగించారు. అప్పటికే అక్కడ మరో వర్గం ఉండడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మల్లారెడ్డి, రాజశేఖర్‌‌‌‌రెడ్డితో పాటు మరో వర్గానికి చెందినోళ్లను అదుపులోకి తీసుకున్నారు. 

వాళ్లను పేట్‌‌బషీరాబాద్ పోలీస్‌‌ స్టేషన్‌‌కు తరలించారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చారు. మేడ్చల్‌‌ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామ పరిధిలోని సుచిత్ర ఏరియాలో ఉన్న సర్వే నెంబర్ 81, 82లో 2.10 ఎకరాల భూమి ఉంది. దీనిపై కొంతకాలంగా వివాదం నెలకొంది. సుధామా అనే మహిళ నుంచి 9 మంది కలిసి 1.06 గుంటల భూమి కొనుగోలు చేశారు. 2016 వరకు పొజిషన్​లో ఉన్నారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పని చేసిన మల్లారెడ్డి.. అప్పట్లో తమ భూమిని ఆక్రమించుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిపై కోర్టుకు వెళ్లామని, కోర్టు తమకు అనుకూలంగా ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిందని చెబుతున్నారు. కోర్టు ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి దౌర్జన్యం చేస్తున్నారని.. తమ భూమిని కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని వాపోయారు. 

14 ఏండ్ల కింద కొన్న.. 

14 ఏండ్ల కింద 2.10 ఎకరాల భూమిని కొనుగోలు చేశాను. కొంతమంది నా భూమిని కబ్జా చేసి, రాత్రికి రాత్రికి ఫెన్సింగ్ వేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇద్దరు ఎమ్మెల్యేలకు చెందిన స్థలాన్ని కబ్జా చేయడం కంటే దౌర్జన్యం మరొకటి ఉంటుందా? కాంగ్రెస్ హయాంలో దౌర్జన్యం చేస్తున్నారు. 
-
మల్లారెడ్డి, మేడ్చల్​ ఎమ్మెల్యే 

మల్లారెడ్డిది 1.29 ఎకరాలే.. 

గతంలో చేసిన అన్ని సర్వేల్లోనూ మల్లారెడ్డికి 1.29 ఎకరాలు మాత్రమే వచ్చింది. ఇప్పుడు 2.10 ఎకరాలు అంటున్నడు. గతంలో  సర్వే చేసిన అనంతరం మా భూమికి మేం హద్దులు వేసుకున్నాం. కానీ మల్లారెడ్డి వాటిని దౌర్జన్యంగా కూల్చివేశాడు. అప్పట్లో బీఆర్ఎస్​ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఉండడంతో భయపడి వెళ్లలేదు. ఈరోజు వస్తే గూండాలతో దాడి చేయించాడు.                               -

బషీర్, బాధితుడు