Health : మీకు మోకాళ్ల నొప్పులు ఉన్నాయా.. అయితే ఆరోగ్యం కోసం రన్నింగ్ బెస్టా.. యోగా మంచిదా.. జిమ్ బెటరా..?

Health : మీకు మోకాళ్ల నొప్పులు ఉన్నాయా.. అయితే  ఆరోగ్యం కోసం రన్నింగ్ బెస్టా.. యోగా మంచిదా.. జిమ్ బెటరా..?

కీళ్ల నొప్పి... దీనిని శాస్త్రీయంగా ఆర్థ్రాల్జియా అంటారు. కీళ్ల నొప్పి అనేది వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ వేధించే సమస్య. ప్రస్తుతం మన దేశంలో ప్రతి ఇద్దరు భారతీయులలో ఒకరు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వారిలో హార్మోన్ల మార్పులు, శారీరక శక్తి తగ్గడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటోంది.

అయితే ఈ కీళ్ల నొప్పులకి ముఖ్య కారణాలు చూస్తే ఆర్థరైటిస్ అంటే కీళ్ల వాతం, అధిక బరువు,  శరీరంలో వాపులు లేదా పాత గాయాలు, సరైన జీవన విధానం లేకపోవడం, వయస్సు పెరిగే కొద్దీ ఎముకల మధ్య ఉండే గుజ్జు (Cartilage) అరిగిపోవడం.

ప్రముఖ డాక్టర్ల  ప్రకారం, రోజూ వ్యాయామం చేయడం వల్ల కీళ్ల కదలికలు మెరుగుపడతాయి. అయితే కొన్ని విషయాలను మాత్రం  గుర్తుంచుకోవాలి.  కీళ్ల నొప్పులు ఉన్నవారు జిమ్ లో  కఠినమైన వ్యాయామాలకి దూరంగా ఉండాలి.  అధిక బరువు ఎత్తడం  చేయకూడదు. కీళ్లపై ఎక్కువ ఒత్తిడి పడని చిన్న చిన్న వ్యాయామాలను మాత్రమే చేయాలి. 

రన్నింగ్ వల్ల లాభమా ? నష్టమా ?
పరిగెత్తడం వల్ల కీళ్ల నొప్పులు పెరుగుతాయనేది ఒక అపోహ మాత్రమే. ఒక పరిమితి వరకు పరిగెత్తడం వల్ల కీళ్లు దృఢంగా మారుతాయి, బరువు తగ్గుతారు. ఇంకా భవిష్యత్తులో వచ్చే ఆర్థరైటిస్ నుండి రక్షణనిస్తుంది. కానీ సరైన పద్ధతి తెలియకుండా లేదా వార్మప్ చేయకుండా అతిగా పరిగెత్తితే  కీళ్ల నొప్పులు రావచ్చు. రన్నింగ్ ప్రారంభించే ముందు మోకాలి కండరాలకి  వార్మ్ అప్ చేసుకోవడం ముఖ్యం.

అద్భుతమైన మార్గం యోగా  
40 ఏళ్లలోపు లేదా ఆ పైన వయస్సు ఉండి  తీవ్రమైన కీళ్ల నొప్పులతో బాధపడేవారికి యోగా ఉత్తమమైన మార్గం. కొన్ని యోగా వంటి పద్ధతులు శరీర ఫ్లెక్సిబిలిటీ పెంచుతాయి ఇంకా కీళ్ల నొప్పుల నుండి రిలీఫ్ ఇస్తాయి.

►ALSO READ | ఈ 3 రకాల ఆహారాలు కలిపి తినొచ్చా.. తింటే ఏమవుతుంది.. సైన్స్ ఏం చెబుతోందంటే ?

జిమ్‌కు వెళ్లేవారు గుర్తుంచుకోవాల్సినవి ఏంటంటే జిమ్ చేయడం వల్ల కండరాలు బలపడతాయి, కానీ తప్పుగా చేస్తే ప్రమాదం ఏర్పడొచ్చు.  అతిగా బరువులు ఎత్తడం, తప్పుడు భంగిమల్లో వ్యాయామం చేయడం వల్ల కీళ్లు దెబ్బతింటాయి. వ్యాయామానికి ముందు తప్పనిసరిగా వార్మప్ చేయాలి అలాగే వారానికి కనీసం రెండు రోజులు శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి.

ఎప్పుడు డాక్టర్‌ని సంప్రదించాలి?
కీళ్ల నొప్పి  ఉన్నప్పుడు టెన్నిస్ బాల్ లేదా ఫోమ్ రోలర్లతో మసాజ్ చేసుకోవచ్చు. కానీ కీళ్ల దగ్గర వాపు రావడం,  కీళ్ల నొప్పితో పాటు జ్వరం రావడం, కీళ్లను కదిలించలేకపోవడం ఈ  లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని కలవాలి.